‘’ఈ జంతువు పేరు కబెర్బిజు . ఇది స్మశానవాటికలో కనిపిస్తుంది. దీనిని చూడటానికి సాధ్యం కాదు ఎందుకంటే ఇది భూమిలో నివసిస్తు,. చనిపోయిన శవాలను తింటుంది. ప్రజలు స్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అరుస్తున్నట్లు అనిపిస్తుంది …కానీ అది కబెర్బిజ్జు యొక్క ఈ గొంతు… ప్రజలు భయపడి, దెయ్యం తిరుగుతోంది అవి దెయ్యపు అరుపులని అపార్థం చేసుకొంటారు. ఈ వీడియోలో ఆ జంతువు యొక్క అరుపులు వినండి మీకే అర్థమవుతుంది.’’

కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారమవుతోన్న పోస్ట్‌ ఇది. దీనికి తోడు 15 సెకనుల నిడివి ఉన్న ఓ వీడియోను కూడా జత చేస్తున్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న జీవి తాబేలును పోలి ఉంది. దాని అరుపులు మనుషుల అరుపులను పోలినట్లు వినిపిస్తోంది. ఈ పోస్ట్‌ కొంతకాలంగా వైరల్‌గా మారింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ ప్రచారం జరిగినట్లు ఫ్యాక్ట్‌ వెరిఫికేషన్‌లో తేలింది.

ఫేస్‌బుక్‌లో పరిశీలిస్తే.. అనేక మంది ఇదే వ్యాఖ్యతో, ఈ వీడియోను తమ వాల్‌పై పోస్ట్‌ చేయడం కనిపించింది. యూట్యూబ్‌, ట్విట్టర్‌లోనూ ఈ వీడియోను పలువురు పోస్ట్‌ చేశారు. తెలుగులో వైరల్‌ కాకముందు కన్నడంలో ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. కన్నడంలో ఒకరు చేసిన ఈ వైరల్‌ పోస్ట్‌ను 41వేల మంది రీట్వీట్‌ చేశారు. లక్షా పదివేల మంది లైక్‌లు కొట్టారు. కన్నడలో చేసిన ఆ పోస్ట్‌ ఇదే.

అంతేకాదు.. ఇదే వీడియో గతంలో ఆంగ్లంలో కూడా మరో రకమైన వ్యాఖ్యతో పలువురు పోస్ట్‌ చేశారు. దాని సారాంశం ఇది.

“A rare animal that cries like a man. This animal is found in Arabian Peninsula and until they found it crying, they used to believe that the cry was of the dead souls from the graves.”

‘మనిషిలా ఏడ్చే అరుదైన జంతువు. ఈ జంతువు అరేబియా ద్వీపకల్పంలో కనిపిస్తుంది. ఈ జంతువు ఇలా ఏడుస్తుందని కనుగొనే దాకా.. స్మశాన వాటికల నుంచి ఇన్నాళ్లు వినబడ్డ అరుపులు చనిపోయిన వాళ్ల ఆత్మలు చేసేవని నమ్మారు.’ అని తెలుగులో అర్థం.

వాస్తవానికి ఈ వీడియో క్లిప్‌ను ఎడిట్‌ చేశారు. టిక్ టాక్‌ యాప్‌లో ఈ వీడియో క్రియేట్‌ చేశారు. ఈ వైరల్ వీడియో మొదట టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేయబడింది. టిక్‌టాక్‌లో శబ్దాలు, సంభాషణలతో కూడిన చిన్న వీడియోలను క్రియేట్‌ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అలా.. టిక్‌టాక్‌ యాప్‌ ద్వారా ఈ వీడియోకు సంబంధంలేని సంభాషణను జతచేశారు. ఈ వీడియో క్లిప్‌కి తన సొంత వ్యాఖ్యానం జోడించిన @ danford1105 అనే యూజర్‌నేమ్‌ కలిగిన వినియోగదారుడు తొలుత అప్‌లోడ్ చేశాడు. అతని టిక్‌ టాక్‌ వాల్‌ నుంచి వేలాది మంది రీ పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది.

అయితే.. ఈ వీడియోను రీ పోస్ట్‌ చేసిన మరో టిక్‌ టాక్‌ యూజర్‌ @hummy411 ఈ వీడియో క్రియేషన్‌ వెనుక అసలు విషయాన్ని చెప్పాడు. లో ‘Scream, Man- Authentic Sound Effects’ అని రాసాడు. ‘Scream, Man- Authentic Sound Effects’ అనేది ఒక సౌండ్ ఎఫెక్ట్ అని, దాని ఆధారంగా ‘Tik Tok’ యూజర్లు వీడియోలకు ఆడియో క్రియేషన్లు చేస్తారు. ఈ వివరణ ఇచ్చిన టిక్‌టాక్‌ పేజీ లింక్‌ ఇక్కడ చూడొచ్చు.

ఎలిగేటర్‌ స్నాపింగ్‌ టర్టిల్‌ పూర్తి సమాచారం :

వీడియోలో కనిపిస్తున్న ఈ జీవి ఎలిగేటర్ స్నాపింగ్ టర్టిల్‌ (ఉత్తర అమెరికా ప్రాంతంలో కనిపించే ఓ రకమైన తాబేలు). దీని శాస్త్రీయ నామం Macrochelys temminckii (మాక్రోకెలిస్‌ టెమింకీ). ఈ ఎలిగేటర్ స్నాపింగ్ టర్టిల్‌ ఉత్తర అమెరికాలో అతిపెద్ద మంచినీటి తాబేలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాణుల్లో ఒకటి. ఈ తాబేళ్లు మాంసాహారులు. షెల్‌మీద మేకుల్లాగా మొనలుంటాయి. ముక్కులాంటి దవడలు మరియు మందపాటి, పొలుసులతో కూడిన తోకతో, ఉండే ఈ జాతి తాబేలును.. “తాబేలు ప్రపంచంలోని డైనోసార్” అని పిలుస్తారు. ఆగ్నేయ అమెరికాలోని నదులు, కాలువలు మరియు సరస్సులలో కనుగొనబడిన ఎలిగేటర్ స్నాపర్స్ 50 నుండి 100 సంవత్సరాల వయస్సు వరకు జీవించగలవని తేలింది. మగ ఎలిగేటర్‌ స్నాపర్స్‌ సగటున 26 అంగుళాల షెల్ పొడవు, 175 పౌండ్ల బరువు కలిగి ఉంటాయి. కొన్ని మాత్రం 220 పౌండ్లకు మించికూడా బరువు ఉంటాయి. ఎలిగేటర్ స్నాపర్లు తమ జీవితకాలంలో ఎక్కువ భాగం నీటిలో గడుపుతాయి. ఎలిగేటర్ స్నాపర్ వేటకు ఒక ప్రత్యేకమైన సహజ ఎరను ఉపయోగిస్తుంది. దాని నాలుక ప్రకాశవంతమైన-ఎరుపు, పురుగు ఆకారంలో ఉన్న మాంసం ముక్కను కలిగి ఉంటుంది. దాని ద్వారా చేపలు, కప్పలను నోట్లోకి లాక్కొంటుంది.

ఈ తాబేలు పలురకాల శబ్దాలు చేయగలుగుతుంది. కానీ మనిషిలా అరవడం, ఏడవడం మాత్రం చేయదు. కాబట్టి ఈ వీడియోకు క్రియేట్‌ చేయబడిన ఆడియో జోడించబడింది. కింది యూట్యూబ్‌ లింక్‌లో అసలు వీడియో చూడొచ్చు.

ఎలిగేటర్ స్నాపింగ్ టర్టిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ లింక్‌లో చూడొచ్చు.

https://www.nationalgeographic.com/animals/reptiles/a/alligator-snapping-turtle/

———————————–
ప్రచారం : మనిషిలాగా అరుస్తున్న కబెర్బిజు అనే జంతువు
వాస్తవం : అది Alligator Snapping Turtle. మనిషిలాగా అరిచే ప్రాణి కాదు. వీడియోను ఎడిట్‌ చేయడంతో చాలామందికి తెలియక వైరల్‌గా మారింది.
————————– ———–

కంక్లూజన్‌ : ఇదో రకమైన తాబేలు – మనుషుల్లాగా అరుస్తుందనే ప్రచారం అబద్ధం

– సుజాత గోపగోని

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.