హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, పార్టీ పరంగా చేయాల్సిందంతా చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని పొన్నం తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం తలచుకుంటే ఒక గంటలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుంది..అని పొన్నం వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సింగరేణిపై చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని పొన్నం అన్నారు. మైన్స్‌పై మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. నిరాధారమైన నిందారోపణలు చేస్తూ అధికారంలో ఉన్న వారిపై బురదజల్లితే ప్రజలు హర్షించరు. సీఎం రేవంత్ విదేశాల నుంచి తర్వాత 2014 నుంచి 2026 జనవరి వరకు ఇచ్చిన గనులపై విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం..అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మరో వైపు హిల్ట్ పాలసీపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనేక ఆరోపణలు చేశారు, చర్చ పెడితే మాట్లాడకుండా తప్పించుకున్నారు..అని పొన్నం ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల మీద సెంటిమెంట్ రాజేసి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారని పొన్నం అన్నారు. శాసనసభ వేదికగా జవాబు చెప్పలేక ముఖం చాటేసి బహిష్కరించారు. ముందు టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పండి..అని పొన్నం డిమాండ్ చేశారు.