ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ముక్కు నేలకు రాసి, సీఎం పదవికి రాజీనామా చేస్తారా?: బండి సంజయ్
కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ముక్కునేలకు రాసి పదవి నుంచి తప్పుకుంటారా? అని సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సవాల్ చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 11:37 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ముక్కు నేలకు రాసి, సీఎం పదవికి రాజీనామా చేస్తారా?: బండి సంజయ్
కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ముక్కునేలకు రాసి పదవి నుంచి తప్పుకుంటారా? అని సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సవాల్ చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని.. అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. సీబీఐ విచారణకు కోరాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే.. ప్రభుత్వం ఒప్పుకోని విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారపోయారు. వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే మీరు. మీరు విదేశాలకు పంపిస్తే.. మేం పట్టుకుని రావాలా? అని బండి సంజయ్ సెటైర్ వేశారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తర్వాత కూడా.. ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదు?, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం చేయలేని అసమర్థులు మీరు అని.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి మూడు నెలలైనా ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ వల్లే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిందని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారు.. అయినా ఎందుకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయలేదు అని సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా విచారణ కమిషన్ గడువును పొడిగిస్తున్నారే తప్ప.. కేసీఆర్‌ను విచారించడం లేదు అని ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర ఏం చేసిందనే విషయంపై గ్రామాల వారీగా లెక్కలతో సహా చర్చకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనకు రూ.1.5 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి రూపాయి వెళితే కేంద్రం 42 పైసలే ఇస్తోంది.. బిహార్, యూపీలకు ఎక్కువ ఇస్తున్నారని చెప్పడమేంటని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వెనుకబాటు ఆధారంగా కేంద్రం, ఆయా రాష్ట్రాలకు నిధులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసి కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.