కేంద్రం రిపోర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎంత సమయంలో రెట్టింపు అవుతున్నాయంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 April 2020 9:57 AM IST![కేంద్రం రిపోర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎంత సమయంలో రెట్టింపు అవుతున్నాయంటే.. కేంద్రం రిపోర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎంత సమయంలో రెట్టింపు అవుతున్నాయంటే..](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/Central-Govt-Report.jpg)
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత బీభత్సం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైరస్ దాటికి జనజీవనం స్థంభించిపోగా.. దేశాలు ఆర్థికంగా ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే.. వైరస్ నియంత్రణలో బాగంగా జరుపుతున్న పరిశోధనలు, జాగ్రత్త చర్యలలో కేంద్రం ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. కేసుల సంఖ్య అంతకుఅంత పెరిగిపోతుండటంతో వాటి సంఖ్య రెట్టింపు అవడానికి పడుతున్న సమయాన్ని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వివిధ దేశాల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం 3-4 రోజుల సమయం పడుతుండగా.. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి అవుతున్న సమయాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రకారం వారం రోజుల వ్యవధిలో(జాతీయ సగటు 7.5 రోజులు) కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపింది.
అయితే.. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఎగువన ఉన్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 9.4 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 10.6 రోజుల సమయం పడుతోందని కేంద్రం తెలిపింది. ఇక మిగతా రాష్ట్రాలలో.. ఢిల్లీలో 8.5 రోజులు, కర్ణాటకలో 9.2 రోజులు, జమ్మూ కాశ్మీర్ లో 11.5 రోజులు, పంజాబ్ లో 13.1 రోజులు, ఛత్తీస్ గఢ్ లో 13.3 రోజులు, తమిళనాడులో 14 రోజులు, బిహార్ లో 16.4 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపవుతుందని కేంద్రం వెల్లడించింది.
ఇక ఈ జాబితాలో ఒడిశా, కేరళ రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఒడిశాలో 39.8 రోజులు, కేరళలో 72.2 రోజుల సమయం కేసుల సంఖ్య రెట్టింపు అవడానికి పడుతోందని తెలిపింది. లాక్‌డౌన్ నేఫథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠినమైన చర్యల కారణంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కేంద్రం పేర్కొంది.