రేప్ కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు 

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 1:54 PM GMT
రేప్ కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు 

భారత దేశంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని నడివీధుల్లో కామాంధుల చేతుల్లో బలైన నిర్భయ మొదలుకొని.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివారులో మృగాళ్ల బారిన పడి అశువులు బాసిన దిశ వరకు ఎందరో ఆడవారు బలయ్యారు. ఈ నేపథ్యంలోనే మహిళల రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలు చేస్తున్నా.. శిక్షలు అమలు చేస్తున్నా.. నేరాలు మాత్రం తగ్గడం లేదు. పసి పిల్లలు మొదలుకొని.. పండు ముసలి వరకు ఆడవారిపై కామాంధుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. నిర్భయ నిందితుల ఉరితో కొత్త ఒరవడికి తెర లేవడంతో కొంత మార్పు వచ్చింది.

తాజాగా ఓ చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉన్మాదికి ఉరిశిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు పెంటయ్యకు విజయవాడ స్పెషల్ పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

2019లో విజయవాడలోని భవానీపురంలోని నల్లకుంటలో ఏడేళ్ల చిన్నారి ద్వారకపై నిందితుడు పెంటయ్య అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడికి, హతురాలి తల్లికి ఉన్న అక్రమ సంబంధం ఆ చిన్నారికి తెలియడంతో తెలిసిపోవటంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడు పెంటయ్యను అరెస్టు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. పెంటయ్య నేరం చేశాడని విచారణలో తేలింది. దీంతో, పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ విజయవాడ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో పెంటయ్యకు 7యేళ్లు, 20యేళ్లు, జీవిత ఖైదు, ఉరి శిక్షను న్యాయమూర్తి విధించారు.

Next Story