కృష్ణా జిల్లాలో విషాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. తల్లికొడుకుల మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 5:30 AM GMT
కృష్ణా జిల్లాలో విషాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. తల్లికొడుకుల మృతి

కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన అవని గడ్డ- విజయవాడ కృష్ణా కరకట్టపై చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ కుటుంబం సోమవారం అర్థరాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి కారులో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అవనిగడ్డ- విజయవాడ కృష్ణ కరకట్టపై ఎదురుగా వస్తున్న వాహానాన్ని తప్పించబోయి అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనలో తల్లి, పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రి, చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన తండ్రి కిరణ్‌కుమార్‌, 11నెలల చిన్న కుమారిడిని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని పెనుమాకకు చెందిన విస్సంశెట్టి దుర్గా మహాలక్ష్మి(32), శ్రీమహత్‌(6) గా పోలీసులు గుర్తించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి, కొడుకుల మృతితో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story
Share it