బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, అబద్ధాలు మాట్లాడారు. కవిత కేసీఆర్ విడిచిన బాణం అని సందేహం. ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబం కొత్త నాటకానికి తెరలేపారు. కవిత రాజీనామా చేయడం శుభ పరిణామంగా భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫైనల్ డెసిషన్ మేకింగ్‌లో కవిత ఒకరు. కవిత భాగాన లేకుండా అవినీతి జరిగిందా? కవిత రాజీనామా ఐదేళ్ల ముందే చేసుంటే ప్రజలు అంగీకరించేవారు..అని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.
పదేళ్లు అవినీతిలో కవిత భాగస్వామ్యం అయ్యారు. వాటాల పంపకాల్లో తేడాల కారణంగానే కవిత కొట్లాట. సంతోష్ రావు, హరీశ్ రావు వెనక ఉండాల్సిన ఖర్మ మాకేంటి? మేం ప్రజల వెంట ఉన్నాం. దోచుకుని దాచుకొని నీతి వ్యాఖ్యలు కవిత మాట్లాడటం విడ్డూరం. అవినీతి పరుల విషయాల్లో తల దూర్చడం మాకిష్టం లేదు. అవినీతిపరులను ఒకే కోణంలో చూస్తాం. సీఎం రేవంత్‌పై అభాండాలు వేయడం సరికాదు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు. కవిత అమెరికా వెళ్లి రాగానే స్టాండ్ ఎందుకు మార్చారు? కేటీఆర్‌పై ఎక్కు పెట్టిన బాణం హరీశ్‌పైకి ఎందుకు మళ్లింది?..అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.