ఆ ఇద్దరు చెప్పారనే మేడిగడ్డను రేవంత్ రిపేర్ చేయడంలేదు: కేటీఆర్
బీజేపీ తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేదు, గాయాలు మాత్రమే చేసింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
By Knakam Karthik
ఆ ఇద్దరు చెప్పారనే మేడిగడ్డను రేవంత్ రిపేర్ చేయడంలేదు: కేటీఆర్
బీజేపీ తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేదు, గాయాలు మాత్రమే చేసింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చిన ఐటిఐఆర్ ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ టూ బెంగుళూరుకు డిఫెన్స్ కారిడార్ కావాలని అడిగినా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. నేషనల్ డిఫెన్స్ కారిడార్ ను యూపీలో పెట్టుకున్నారు. తెలంగాణపై బీజేపీకి, మోడీకి ప్రేమ లేదు. కేన్స్ అనే పరిశ్రమను బీజేపీ గుజరాత్ కు తరలించుకుపోయింది. ఎలక్ట్రానిక్స్ పార్క్‌లో పెట్టాల్సిన కంపెనీని ఏపీకి తరలించుకుపోయారు. 22 కొత్త జిల్లాలకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీలు దేశం మొత్తం ఇచ్చి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. పసుపు బోర్టు మాత్రమే వచ్చింది అక్కడ మన్ను, మశానం లేదు. పాలమూరు,రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని సుష్మాస్వరాజ్ మాట ఇచ్చారు. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దని అంటున్నారు. గోదావరి నీళ్లు కావేరి వరకు తమిళనాడు దాకా పోవాలని మోదీ అంటున్నారు. తెలంగాణకు హిమాలయాల నుంచి నీళ్లు ఇస్తారంట. దొంగలు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది ఎంపీలు గెలిచారు..అని కేటీఆర్ విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి బామ్మర్దికి బీజేపీ వాళ్ళు కాంట్రాక్టులు ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారు. సివిల్ సప్లైస్ కుంభకోణంపై బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది. బడా మోదీ, ఛోటా మోదీకి దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ అన్నారు. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ప్రతి ఇంటికి 15లక్షలు ఇస్తామని మోదీ అన్నారు. మోడీ ఈడీని పంపుతారు...రేవంత్ రెడ్డి ఏసీబీని పంపుతారు. రేవంత్ రెడ్డి నాపై ఫార్ములా ఈ రేస్ లో కేసు పెట్టారు. రాహుల్ గాంధీకి ఎప్పుడో దెబ్బపడుతుంది. రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు. రేవంత్ రెడ్డిని నా మనిషి అని రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరు అనుకుంటున్నారు...అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఎక్కడా చూసినా చెప్పుల జాతరే..
నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల చెప్పుల జాతర నడుస్తోంది అని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టండి. ఓయూలో బిల్డింగులు కట్టింది బిఆర్ఎస్ హయాంలో. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండు. రేవంత్ రెడ్డిని కోసుకుని తినడానికి నువ్వు ఏమయినా కేకువా...? మామిడి పండువా? కేసీఆర్ ను తిడితే బరాబర్ నేను రేవంత్ రెడ్డిని తిడుతా. స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీకి బుద్ది చెప్పండి. దేశం మొత్తంలో ఒక్క తెలంగాణలోనే యూరియా సంక్షోభం ఎందుకు ఉంది. యూరియా సంక్షోభంలో రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మాటపడనివ్వడం లేదు. గోదావరి నీళ్లు ఏపీకి తరలించి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా కావేరీకి తీసుకువెళ్లాలని చంద్రబాబు కుట్ర పన్నారు. గోదావరి నీళ్లు కిందికి వెళ్లడం కోసం మేడిగడ్డను రిపేర్ చేయవద్దని రేవంత్ రెడ్డికి మోదీ,చంద్రబాబు చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి మేడిగడ్డ రిపేర్ చేయడం లేదు..అని కేటీఆర్ పేర్కొన్నారు.