గత బీఆర్ఎస్ ప్రభత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. హైదరాబాద్ బేగంపేట్ పాటిగడ్డలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణ భవిష్యత్‌కు ముప్పుగా దాపురించింది. కేసీఆర్ నిర్వాకం కారణంగా నెలకు రూ.6 వేల కోట్లు ప్రజాధనాన్ని అప్పులు చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుంది..అని సీతక్క పేర్కొన్నారు.
సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే, పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్‌ది. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా? ఉపాధ్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగులగొట్టింది ఎవరు కేటీఆర్? ఎందరో ఉద్యమకారులను అవమానపరిచి బయటకు పంపిన చరిత్ర మీది. అప్పులు, అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు చేసిన అభివృద్ధి ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఎక్కడా కూడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నాం..అని మంత్రి సీతక్క మాట్లాడారు.