ఆ 400 ఎకరాలు ఫారెస్ట్ పరిధిలోనివే : బండి సంజయ్ హాట్ కామెంట్స్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 1 April 2025 11:06 AM IST

Telangana, Bandi Sanjay, Hyderabad News, Kanche Gachibowli Land, CM Revanthreddy, Brs, Congress

ఆ 400 ఎకరాలు ఫారెస్ట్ పరిధిలోనివే, బండి సంజయ్ హాట్ కామెంట్స్

హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని టెండర్లు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కంచ గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.

ఈ భూములకు సంబంధించి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. వట ఫౌండేషన్‌ అనే ఎన్ జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని అందువల్ల ఆ భూములను వేలం వేయడం కుదరదన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని, చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

కంచె గచ్చిబౌలి భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం అని బండి సంజయ్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Next Story