హైదరాబాద్: సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతాన్ని సోమవారం బయటపెట్టగానే తనకు సిట్ నోటీసులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఠా అవినీతిని బయట పెడుతున్నందుకే కేసులు, నోటీసులు అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు 11:00 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ వద్ద కేటీఆర్, ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని హరీశ్‌రావు తెలిపారు. దండుపాళ్యం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టానని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని.. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నామని తెలిపారు. తాము తెలంగాణ ఉద్యమకారులమని.. కేసీఆర్ తయారుచేసిన సైనికులమని తెలిపారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు.