హైదరాబాద్: టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాప్ టీవీ సీరియల్‌ను తలపిస్తోందని, అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్ లో భాగమేనని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఈ కేసు, విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి మరియు కుంభకోణాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ (SIT) విచారణను ఒక ఆయుధంగా వాడుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యంగా నైని బొగ్గు గనుల కుంభకోణం బయటపడటంతో ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉందని, దానిని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల డ్రామా అని ఆయన పేర్కొన్నారు. గతంలో హరీష్ రావుని, తనను కూడా ఇదే కేసు పేరుతో విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోష్ కుమార్ ని లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.
నేడు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్‌కి బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్ కి నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని కేటీఆర్ అన్నారు. సంతోష్ కుమార్ కి పార్టీ అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు.