కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి అని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాణ మిత్రులుగా మారారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో కేసీఆర్ కుటుంబం అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆ కేసులను నీరుగారుస్తోంది..అని బండి సంజయ్ ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్, ఫాంహౌజ్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే మొదట్లో మాట్లాడారు. కానీ కేటీఆర్ తో కుమ్మక్కైన తరువాత ఆ కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుండటం సిగ్గు చేటు. అందుకు ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీకి, అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నారు. 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో, బయట నిలదీయకుండా ఉత్తుత్తి డ్రామాలాడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములను తెగనమ్మడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే... పైకి గొడవ చేసినట్లు నటిస్తున్నా లోలోపల ఆయనకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
వాస్తవానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్య మైత్రి ఎన్నడో బట్టబయలైంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారు. త్వరలో హైదరాబాద్ లో జరగబోయే బహిరంగ సభ నిర్వహణ, ఆ సభకు ఎవరెవరిని పిలవాలో ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేసేలా నిర్ణయం తీసుకుంది కూడా వారిద్దరే. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్ ను గెలిపించేందుకు సహకరిస్తున్నది రేవంత్ రెడ్డి, కేటీఆర్ లే. అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంచింది కేటీఆరే.. అని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.