విడాకులు, వివాహాల రద్దు అంశంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. భార్యాభర్తలు కలిసి బతకలేని పరిస్థితులున్నప్పుడు విడాకుల కోసం ఆరు నెలల ఎదురు చూడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరూ ఒప్పుకుంటే తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ఆధారంగా విచక్షణాధికారాలను ఉపయోగించే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయని తెలిపింది. విడాకులను మంజూరు చేయడానికి ఫ్యామిలీ కోర్టులను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయిదుమంది న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓఖా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
ఈ విషయంలో సుప్రీంకోర్టుకు విశిష్ట అధికారాలున్నాయని గుర్తు చేసింది న్యాయస్థానం. ఈ కేసు ఎనిమిదేళ్ల నాటిది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు కోరుతూ శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ 2014లో దాఖలు చేసుకున్న కేసు ఇది. ఈ కేసులో అప్పటి డివిజన్ బెంచ్ న్యాయమూర్తులైన జస్టిస్ కీర్తి సింగ్, జస్టిస్ ఆర్ భానుమతిల ధర్మాసనానికి బదిలీ అయింది. సుదీర్ఘ వాదనల అనంతరం గత ఏడాది సెప్టెంబర్ నెలలో తీర్పు రిజర్వ్ చేసింది డివిజన్ బెంచ్. ఇవాళ ఈ కేసులో తీర్పు వెలువరించారు. విడాకులను మంజూరు చేయడంలో విచక్షణాధికారాలను వినియోగించవచ్చని తెలిపింది. విడాకులకు భార్యభర్తలిద్దరూ అంగీకారం తెలిపినప్పుడు మాత్రమే న్యాయమూర్తి తన విచాక్షణాధికారంతో విడాకులు మంజూరు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది.