స్వలింగ వివాహాలపై కేంద్రం చెబుతోంది ఇదే.!
Centre opposes same-sex marriage in Supreme Court. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చేసింది.
By M.S.R Published on 17 April 2023 3:43 PM ISTSupreme Court
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చేసింది. సుప్రీం కోర్టులో స్వలింగ వివాహలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన వాదనలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లు.. కేవలం పట్టణ ప్రాంతాల్లో ఉండే ఉన్నత వర్గాల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని.. పిటిషనర్లు దేశ ప్రజల అభిప్రాయాలను ప్రతిబించేవాళ్లు కాదని కేంద్రం తెలిపింది. భారత సమాజంలో వివాహ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి చట్టపరమైన గుర్తింపుతో కొనసాగుతున్న ఒక భిన్నమైన సంస్థ. మతాలపరంగానూ ఇది ప్రభావితం చూపించే అంశం. కాబట్టి, ఇది దేశంలోని ప్రతీ పౌరుడిని ప్రభావితం చేస్తుందని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహాలకు కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది. ఇది పూర్తిగా చట్ట పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని కేంద్రం అభిప్రాయపడింది. వివాహ వ్యవస్థ అనేది సామాజిక అంశమని, దానికి సామాజిక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిపప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి వాదనలు విననుంది.