ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. సచివాలయ భవనంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ తన పిటిషన్ లో ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటీషన్ విచారణకు రాగా కేఏ పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. దేశంలో జరిగే అగ్నిప్రమాద ఘటనలన్నిటినీ సీబీఐతో విచారణ జరిపించమంటారా? అని కేఏ పాల్ పై అసహనం వెలిబుచ్చింది. అగ్నిప్రమాద ఘటనలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తన జీవితానికి ముప్పు ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కేఏ పాల్. ఒకదానికి మరొక అంశం ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. కేఏ పాల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.