చేతిలో నిధులు ఉన్నా.. ఖర్చు చేయని దరిద్రమేంది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 5:41 AM GMT
చేతిలో నిధులు ఉన్నా.. ఖర్చు చేయని దరిద్రమేంది?

ఓ వైపు నిధుల కొరతతో పనులు జరగని పరిస్థితి. మౌలిక సదుపాయాలతో పాటు.. విచక్షణ అధికారంతో తనకు కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ.. నేతాశ్రీలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు చూస్తే ఒళ్లు మండక మానదు. జేబులో డబ్బు బయటకుతీసి ఖర్చు చేసే అవసరం లేకున్నా.. ఏమీ పట్టని తనంతో పాటు.. పీనాసితనం ఎంపీల చేత తమకిచ్చే నిధుల్ని ఖర్చు పెట్టకుండా మురగబెట్టే పరిస్థితి నెలకొంది.

ఎంపీలకు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు ఖర్చు చేసేందుకు వీలుగా ఏడాదిలో రెండుసార్లు రూ. 5కోట్ల మొత్తాన్ని ఇస్తారు. వాటితో డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరానికి.. ఈ పథకాన్ని నిలిపివేశారు. మహమ్మారి కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అరే.. అలా నిధులు ఆపేస్తే పనులు ఆగిపోవా? అన్న కంగారుఅక్కర్లేదు.

ఎందుకంటే.. చేతికి డబ్బులిచ్చి ఖర్చు చేయండ్రా బాబు.. అంటేనే ఖర్చు చేయని దౌర్భాగ్యం కళ్లముందు కనిపించే పరిస్థితి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎంపీలకు కేటాయించిన నిధుల్లో 10 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. తొలివిడత నిధుల్లో ఏపీ ఎంపీలు 10.97 శాతం ఖర్చు చేస్తే.. తెలంగాణ ఎంపీల కంటే తామే తక్కువేం తిననట్లుగా ఏపీ ఎంపీల మరింత తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిన వైనం వెలుగు చూసింది.

తమకిచ్చిన నిధుల్లో తెలంగాణ ఎంపీలు 10.97 శాతం ఖర్చు చేస్తే.. ఏపీకి చెందిన ఎంపీలు కేవలం 10.31 శాతం నిధుల్ని మాత్రమే ఖర్చు చేసినట్లుగా గుర్తించారు. ఏపీ ఎంపీలు తమ ఖాతాల్లో తమ ఖాతాల్లోని నిల్వల్లో 95.87 శాతాన్ని.. తెలంగాణ ఎంపీలు 74.35 శాతం పనులు మంజూరు చేసినా అధికారులు మాత్రం కేవలం పది శాతం మాత్రమే ఖర్చు చేయటం గమనార్హం.

ఎంపీలు తమకున్న నిధుల్ని మంజూరు చేసినా.. వాటి ఖర్చులో మాత్రం అధికారులు పనికిమాలిన పీనాసితనాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు. తాము మంజూరు చేయించిన నిధులు ఖర్చు పెట్టని తీరును సరిదిద్దే విషయంలో ఎంపీలు ఎందుకు ఫెయిల్ అయినట్లు? అన్నది అసలు క్వశ్చన్.

Next Story