ఏపీఐఐసీ చైర్మ‌న్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. లోకేష్ గ‌త ప్ర‌భుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఇంట్లో తిని కూర్చొని ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు.

లాక్‌డౌన్ వేళ‌.. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి, కొడుకులు ఇద్దరు దొంగల్లాగా పారిపోయి హైదరాబాద్‌లో తలదాచుకున్నారని.. ఇప్పుడు మాత్రం పార్టీలో ఉన్న అవినీతి గద్దల కోసం హైదరాబాద్‌ను వీడి ఏపీకి పరుగులు తీశారని విమ‌ర్శించారు. చంద్రబాబు, లోకేష్ ల‌కు కేవలం అధికారం, డబ్బు మాత్రమే కావాలని.. ప్రజలపై ఏమాత్రం అభిమానం లేదని రోజా ఆరోపించారు.

ఇక లోకేష్.. పనిపాటా లేకుండా ఇంట్లో కూర్చుని పబ్జి గేమ్ ఆడుతుంటాడని.. సీఎం జగన్ అలా కాదని.. 151 సీట్లతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మా నాయ‌కుడి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని పేర్కొన్నారు. కేవ‌లం సంవత్సర పరిపాలనలోనే సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీలు దాదాపు 100 శాతం పూర్తి చేశారని అమ్మఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, మహిళలకు సున్నా వడ్డీ రుణాలతో జ‌గ‌న్ పాల‌న ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చేలా సాగుతుంద‌ని రోజా ప్రశంసలు కురిపించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *