‘తమ్ముడి’ లేఖకు కన్నబాబు కౌంటర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 5:38 AM GMT
‘తమ్ముడి’ లేఖకు కన్నబాబు కౌంటర్

కొన్నిసీన్లు రాజకీయాల్లో మాత్రమే చూడగలుగుతాం. ఈనాడు దినపత్రికలో స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా ఉంటూ మెగాస్టార్ చిరుతో పరిచయం.. ఆయనతో ఒద్దికతో దగ్గర కావటం కురసాల కన్నబాబుకే దక్కింది. పాత్రికేయుడిగా పలువురితో పరిచయం అందరికి ఉండేదే. కానీ.. ఆ పరిచయాన్ని సరైన రీతిలో వినియోగించటం చాలామందికి చేతకానిది. అలాంటి టాలెంట్ ఆయనకు చాలా ఎక్కువన్న మాట ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మూడో కంటికి తెలీకుండా ప్రజారాజ్యం ఏర్పాటులో కీలకభూమిక పోషించిన ఆయన రేంజ్ ఎంతన్నది ప్రజారాజ్యం పార్టీని అధికారికంగా ప్రకటించే వేదిక మీద.. చిరంజీవి నోట వచ్చే మాటల్ని తన సూచనతో కాసేపు ఆపించే కన్నబాబు శక్తిని టీవీ లైవ్ లో చూసినోళ్లు షాక్ తిన్నారు.

తమ వెంట తిరిగే కన్నబాబులో ఇంత టాలెంట్ ఉందా? అని ఆ రోజున ఈనాడులో ఎంతోమంత్రి సీనియర్ రిపోర్టర్లు ప్రత్యేకంగా చర్చించుకోవటం ఇప్పటికి గుర్తే. మెగాస్టార్ కుటుంబానికి వీర విధేయుడిగా వ్యవహరించిన కన్నబాబు.. తాను కోరుకున్న చోటు నుంచి టికెట్ తెచ్చుకోవటంలో సక్సెస్ కావటంతో ఆయన ఎమ్మెల్యే అయిపోయారు. అలాంటి ఆయన జగన్ దగ్గరకు చేరిన తర్వాత.. తాజా ప్రభుత్వంలో మంత్రిగా మారటం తెలిసిందే.

తన సన్నిహితుల వద్ద ఏ నోటితో అయితే పవన్ సింప్లిసిటీని.. నిజాయితీని కీర్తించారో.. ఇప్పుడు అదే నోటితో పవన్ కమిట్ మెంట్ పై తీవ్రంగా విరుచుకుపడటం చూస్తే.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న వైనం మరోసారి అర్థమవుతుంది. కాపులకు జగన్ సర్కారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖాస్త్రాన్ని సందించటం తెలిసిందే. పవన్ కు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రి కన్నబాబు రంగంలోకి దిగారు.

పార్టీ అధినేత మనసు దోచుకునేలా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపులపై బాబు ఉక్కుపాదం మోపినప్పుడు.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడను లాఠీలతో కుళ్లబొడిచి.. ఆయన భార్యను.. కొడుకును బండ బూతులు తిట్టినప్పుడు నోరు విప్పని జనసేనాధినేత ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపులకు మేలు చేస్తున్న జగన్ సర్కారును చూసి ఓర్వలేకపోతున్నారా? అని ప్రశ్నించిన ఆయన కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ఎవరు నీరుకార్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

కాపు నేస్తం కింద దరఖాస్తు చేసుకున్న 2.35లక్షల మంది మహిళలకు రూ.354 కోట్లను అందించామని.. అర్హత ఉండి అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే.. వారికి సాయం చేస్తామన్నారు. కాపుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇంతగా ఆరాటపడుతుంటే.. పవన్ లాంటి వారు తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు రూ.1879 కోట్లు కాపులకు సాయంగా ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4770 కోట్లు ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. ఏమైనా.. ఒకప్పుడు తమ్ముడి దగ్గర ఆచితూచి మాట్లాడిన కన్నబాబు.. తాజాగా ఘాటు కౌంటర్ ఇచ్చిన తీరు చూస్తే.. కాలం ఎవరిని ఎంతలా అయినా మారుస్తుందన్న విషయాన్ని ఇట్టే అర్థమయ్యేలా చేస్తుందని చెప్పక తప్పదు.

Next Story