కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తే.. ఆ మైలేజీ ఫైర్ బ్రాండ్ దేనట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 7:17 AM GMT
కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తే.. ఆ మైలేజీ ఫైర్ బ్రాండ్ దేనట

రాజకీయాలన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు.. విపక్ష నేతలు ఆయన్ను కలవటం.. ప్రజాసమస్యల్ని ఆయనకు వినతిపత్రం రూపంలో అందజేయటం ఎప్పటి నుంచో ఉన్నదే. అంతేకాదు.. ఏదైనా తీవ్రసమస్య ఎదురైనప్పుడు విపక్ష నేతల్ని.. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్షం వేయటం.. వారి సలహాలు.. సూచనలు తీసుకోవటం మామూలే. ఎక్కడి దాకానో ఎందుకు చైనాతో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే.

తెలంగాణలో మహమ్మారి తీవ్రస్థాయికి చేరుకుంటూ రోజుకు వెయ్యి కేసుల వరకూ వచ్చేస్తున్న పరిస్థితి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని విధించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన.. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించారు.

తమ పార్టీ ఎంపీలు కలిసి సీఎంను కలిసి సమస్యల్ని కేసీఆర్ కు తెలియజేసేందుకు వీలుగా అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం అంతంతమాత్రంగా చేసే పరీక్షల్లోనే పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వైనాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 32.1 శాతం పాజిటివ్ కేసులు (టెస్టులతో పోల్చినప్పుడు) వస్తున్నాయని.. ఇదొక్క అంశం చాలు.. తెలంగాణలో పరిస్థితి ఇప్పుడెలా ఉందో అర్థమైపోతుందని వాపోతున్నారు. వీఐపీ ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద.. మధ్యతరగతి వారి ప్రాణాలకు ఇవ్వటం లేదన్నారు.

ప్రభుత్వాసుపత్రికి వెళ్లే కన్నా శశ్మానానికి వెళ్లటం మంచిదన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. మహమ్మారి కట్టడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సాక్షిగా సలహాలు ఇస్తే ఎగతాళి చేశారన్న వైనాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మాత్రమే కాదు మంత్రులు సైతం బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేశారన్నారు.

Revanth

పారాసిటమాల్ వేసుకొని.. వేడినీళ్లు తాగితే మహమ్మారి పోతుందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టేలా చేశారన్నారు. ఇటీవల కాలంలో మహమ్మారిపై ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమీ మాట్లాడటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు కానీ.. లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకుంటే.. తాము చేసిన సూచనతోనే సీఎం నిర్ణయం తీసుకున్నారన్న వాదనను ఫైర్ బ్రాండ్ వినిపిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ విమర్శల నేపథ్యంలో కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Next Story