ప్రజారోగ్య విషయంలో రాజీపడం : మంత్రి ఈటల రాజేందర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 12:30 PM GMT
ప్రజారోగ్య విషయంలో రాజీపడం : మంత్రి ఈటల రాజేందర్‌

ప్రజారోగ్యం విషయంలో రాజీపడేది లేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం కేరళ, తమిళనాడుతో పోటి పడుతోందని తెలిపారు. లక్షణాలు లేని వారు కరోనా నిర్థారణ పరీక్షల కోసం ఆస్పత్రికి రావొద్దన్నారు. దీని వల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. త్వరలోనే గచ్చిబౌలీలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ అండ్‌‌ రీసెర్చ్‌ (టిమ్స్‌)ను ప్రారంభిస్తామని చెప్పారు. టిమ్స్ లో వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామన్నారు.

కొందరు ప్రభుత్వంపై కుట్ర పూరితంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి డాక్టర్లు వైద్యం చేస్తుంటే గాంధీ దవాఖాన వైద్యులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనాకు వెరవకుండా ప్రభుత్వ వైద్యులు సేవలందిస్తున్నారని కొనియాడారు. జిల్లా స్థాయిలోనూ ఐసీయూలు, వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాంధీ దవాఖాన పూర్తిగా కొవిడ్ హాస్పిటల్ గా మారిందన్నారు. గాంధీ ఆస్పత్రిపై అనవసరంగా బురద జల్లుతున్నారని మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాధ్యత లేనివాళ్లే ఇలా గందరగోళం చేస్తున్నారని, బాధ్యత ఉంటే సమాజానికి సహఖరించాలన్నారు. ప్రజలందరూ గాంధీ, కింగ్‌ కోఠి సహా ప్రభుత్వాసుప్రతులకు రావాలని, ఎంత ఖర్చునైనా భరించి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన ఇంటిలోని వాళ్లపై సామాజిక బహిష్కరణ విధించడం సరికాదన్నారు. అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం సరికాదన్నారు. మృతి చెందిన వారిలో వైరస్‌ ఉండదన్న నిపుణులు చెబుతున్నారని మంత్రి గుర్తు చేశారు.

Next Story