కేసీఆర్ మాటలతో తీవ్ర భావోద్వేగానికి గురైన సంతోష్ ఫ్యామిలీ మెంబర్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 6:27 AM GMT
కేసీఆర్ మాటలతో తీవ్ర భావోద్వేగానికి గురైన సంతోష్ ఫ్యామిలీ మెంబర్స్

అరగంట.. ఆ మాటకు వస్తే.. ఇంకాస్త తక్కువ సమయాన్నే గడిపారు సీఎం కేసీఆర్ .. ఇటీవల వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు నివాసంలో. సూర్యాపేటకు రోడ్డు మార్గాన వచ్చిన ఆయన.. వారింట్లోని వారిని ఓదార్చటమే కాదు.. పరామర్శించారు. వారి వేదనను విన్నారు. ఈ సందర్భంగా వారికేం కావాల్సి వచ్చినా తనను అడగాలన్న ఆయన.. కుటుంబ బాగోగుల్ని చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డికి చెప్పారు.

సంతాప కార్యక్రమాలు అయ్యాక హైదరాబాద్ లోని తమ నివాసానికి రావాలని ఆహ్వానించిన ముఖ్యమంత్రి మాటలతో సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారి కుటుంబానికి తాను కుటుంబ పెద్దలా ఉంటామన్నారు. సంతోష్ బాబు పిల్లలతో కేసీఆర్ మాట్లాడారు.

దగ్గర దగ్గర అరగంట పాటు సంతోష్ నివాసంలో గడిపిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత నేరుగా ఫాంహౌస్ కు బయలుదేరారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. తొలుత అనుకున్నట్లుగా హైదరాబాద్ నుంచి కాకుండా సోమవారం ఉదయం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ నుంచి సూర్యాపేటకు బయలుదేరారు.

కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సూర్యాపేటలో పలు ఆంక్షలు విధించటమే కాదు.. సంతోష్ నివాసంలోనూ పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మహమ్మారి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన సందర్భంగా సూర్యాపేటలో పలు ఆంక్షలు విధించారు. గతంలో పలుమార్లు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వచ్చినా... ఈసారి పెట్టినన్ని ఆంక్షలు అంతకు ముందెప్పుడూ చూడలేదన్న మాట పలువురి నోట వినిపించింది.

Next Story