ముగిసిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ.. పవన్ కీలక నిర్ణయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 2:10 PM GMT
ముగిసిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ.. పవన్ కీలక నిర్ణయం

అమరావతి : జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ముగిసింది. సుమారు 3గంటలకు పైగా జరిగిన సమావేశంలో మూడు రాజధానులతో పాటు పలు విషయాలపై చర్చించిన క‌మిటీ.. ప‌లు నిర్ణయాలు తీసుకుంది. టీడీపీ, వైసీపీలు రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విష‌య‌మై రాజధాని ప్రాంత‌ రైతులకు అండగా నిలబడాలని జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని ఈ భేటీలో తీర్మానించారు.

టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను.. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్వార్ధానికి ఉపయోగించుకుంటోందని పవన్ అన్నారు. రైతులు కన్నీరు పెట్టకుండా భూములు తీసుకోవాలని నాడు చెప్పామన్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి జనసేనాని గుర్తుచేశారు. మూడు రాజధానులనే నిర్ణయం సరైంది కాదని జనసేన స్పష్టం చేసింది. గతంలోనే మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించిందని పవన్ తెలిపారు. ఆనాడు తమ పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్య లోనే ఆపివేయడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పని పవన్ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికలప్పుడు చెప్పిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చి మోసం చేశారని పవన్ మండిపడ్డారు.

టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రాజధాని రైతులను బలి చేయవద్దని ఈ సందర్భంగా సూచించారు. రైతులు 33వేల ఎకరాల భూములను ప్రభుత్వానికే ఇచ్చారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించామని ప్రకటనలో పవన్ క‌ళ్యాణ్‌ చెప్పుకొచ్చారు.

Next Story