అమరావతి అంతా ఇక ఏఎంఆర్‌డీఏ.. ఇంతకీ ఏమిటది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 10:00 AM GMT
అమరావతి అంతా ఇక ఏఎంఆర్‌డీఏ.. ఇంతకీ ఏమిటది?

ప్రజలు పట్టం కట్టిన పాలకులు విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాలే కానీ.. ఏదైనా మార్చేయగలరు. ఆ విషయం తాజాగా ఏపీకి మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. మూడు రాజధానులకు సంబంధించిన అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో.. అమరావతి కథ కంచికి చేరినట్లైంది. అదే సమయంలో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా చెప్పే అమరావతికి సంబంధించి అంతా సీఆర్ డీఏ చుట్టూనే తిరిగేది. రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు వీలుగా ఈ సంస్థను ఏర్పాటు చేయటం తెలిసిందే. రాజధాని ప్రాంత అభివృద్ధి అథార్టీగా చెప్పే ఈ సంస్థ పేరు ఇకపై నుంచి వినపడే అవకాశం లేనట్లే. ఎందుకంటే.. దీని స్థానంలో కొత్తగా ఏఎంఆర్ డీఏ (AMRDA) ను తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇంతకీ ఈ ఏఎంఆర్డీఏ అంటే ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్గీ. సీఆర్డీఏ పేరు కాస్తా ఏఎంఆర్డీఏగా మారిన నేపథ్యంలో ఏం జరుగుతుంది? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న. తాజాగా ఏపీ సర్కారు ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. ఇప్పటివరకు నడిచిన సీఆర్డీఏ ఇందులో భాగం కానుంది. సీఆర్డీఏతో పోలిస్తే ఏఎంఆర్డీఏ స్థాయి పెద్దదిగా చెప్పాలి. తాజా పరిణామంతో తెలుగుదేశం ప్రభుత్వం షురూ చేసిన సీఆర్డీఏ చరిత్రలో కలిసిపోయినట్లే. అదే విషయాన్ని తన తాజా నోటిఫికేషన్ లోనూ వెల్లడించారు.

ఈ సంస్థకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా ఉండనున్నారు. ఈ సంస్థకు పదకొండు మంది అధికారుల్ని సభ్యులుగా ఉంచుతారు. వారిని పాలక కమిటీగా అభివర్ణిస్తారు. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఈ సంస్థకు కమిషనర్ గా వ్యవహరిస్తారు. ఇక.. గుంటూరు.. కృష్ణా జిల్లాలకు చెందిన కలెక్టర్లు.. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్.. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఇక.. ఈ కొత్త సంస్థకు కమిషనర్ గా లక్ష్మీ నరసింహను ప్రభుత్వం నియమించింది.

ఇంతకూ ఈ కొత్త సంస్థ ఏం చేసుంది? ఇందులోని ఉన్నతాధికారులు ఏం చేస్తారన్న విషయాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే.. అమరావతి మెట్రో పాలిటన్ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలి? రాష్ట్రంలోని మూడు రాజధానుల్లో భాగమైన అమరావతి ప్రాంతాన్ని ఎలా తీర్చిదిద్దాలి? ఈ ప్రాంతంలో పడిపోయిన రియల్ ఎస్టేట్ ను పెంచేందుకు ఎలాంటి ప్రాజెక్టుల్ని తెర మీదకు తీసుకురావాలి? భవిష్యత్ ప్రణాళికతో పాటు.. రాజధాని ప్రాంతాన్ని ఎలా పెంచాలన్న కోణంలో ప్రణాళికలు సిద్ధం చేస్తారు.

గతానికి భిన్నంగా గ్రాఫిక్స్ తో హడావుడి చేయకుండా.. వాస్తవ ఆధారంగా ప్రాజెక్టులను డిజైన్ చేయాలన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచనగా చెబుతున్నారు. గతంలో మాదిరి ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా కాకుండా.. డెవలప్ మెంట్ ఆర్గానిక్ (క్రమపద్ధతిలో)గా ఉండేలా ప్లాన్ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. జగన్ సర్కారు అమరావతి ప్రాంతాన్ని మరింతగా డెవలప్ చేయటమే లక్ష్యమంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నెలకొన్న నిరాశను పోగొట్టి.. కొత్త ఉత్సాహాన్ని తీసుకురావటమే లక్ష్యం. రాజధాని తరలిపోయిందన్న ఆవేదనలో ఉన్న వారిలో కొత్త ధైర్యాన్ని నింపేలా ప్రాజెక్టుల్ని డిజైన్ చేయాలని.. మెట్రోరైలు.. ఎక్స్ ప్రెస్ వేలు సిద్ధం చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

Next Story