నాడు బాబు, నేడు జగన్.. ఇద్దరిదీ ఒకే పొరపాటు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 2:20 AM GMT
నాడు బాబు, నేడు జగన్.. ఇద్దరిదీ ఒకే పొరపాటు

విపక్షంలో ఉన్నప్పుడు ఏది తప్పు అంటారో... అధికారంలోకి రాగానే అదే తప్పు ఒప్పైపోతోంది. నాడు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుంటే.. సంతలో పశువులను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ గొంతు చించుకున్నవైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తానూ అదే బాటలో నడుస్తున్నారు. అంటే నాడు తన నోట ఏదైతే తప్పని చెప్పారో.. ఇప్పుడు అదే తప్పును తాను కూడా చేసేస్తున్నారన్న మాటేగా.

అంటే.. నాడు చంద్రబాబు చేసిన తప్పును ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నారన్న మాటేగా. మరి చంద్రబాబు చేసిన తప్పుతో టీడీపీకి ఘోర పరాభవం ఎదురు కాగా.. మరి అదే తప్పు చేస్తున్న జగన్... వైసీపీకి కూడా రానున్న కాలంలో భారీగానే దెబ్బేయనున్నారా? అన్న వాదన కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. అయినా తాను స్వయంగా తప్పు అని గళం వినిపించిన విషయాన్నే ఇప్పుడు జగన్ తన భుజానికెత్తుకున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు.

2014 ఎన్నికల్లో పదేళ్ల తర్వాత విజయం సాధించిన టీడీపీ... నవ్యాంధ్రను సరికొత్త తీరాలకు చేర్చాలన్న భావనతో సాగింది. అయితే పొరుగు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలన్న మాటే వినబడకూదదన్న రీతిలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్న వైనం చూసి చంద్రబాబు కూడా దానికే ఆకర్షితులయ్యారని చెప్పక తప్పదు.

కేసీఆర్ మాదిరే ఏపీలోనూ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను తన పార్టీలోకి లాగేయడాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. ఎన్నికలు సమీపించేనాటికి ఏకంగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎమ్మెల్సీలను కూడా టీడీపీలోకి చేర్చుకున్నారు. అంతటితో ఆగని చంద్రబాబు... పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఏకంగా నలుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నాటి విపక్ష నేత జగన్... తన పార్టీ టికెట్లపై ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారిని సంతలో పశువులను కొన్నట్లుగా కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సరే... ఆ పార్టీలోని నుంచి ఈ పార్టీలోకి చేరికలు జరిగిపోయాక.. ఎలాగూ 2019 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి అంతా తారుమారైంది. పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన ప్రజా ప్రతినిధులందరికీ టికెట్లు కేటాయించడం చంద్రబాబుకు సాధ్యపడలేదు. వెరసి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో చాలా మంది 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చంద్రబాబు వద్దే ఉండిపోయిన వారికి టిడీపీ టికెట్లు దక్కినా... వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచిన దాఖలా లేదు. మొత్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారితో చంద్రబాబు పార్టీకి ఒరిగిందేమీ లేదన్న మాట.

అసలు అలా పార్టీలు మారిన వారిని అందలం ఎక్కించుకున్న చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం కూడా చెప్పారన్న వాదనలు లేకపోలేదు. టీడీపీ ఓటమికి పార్టీ ఫిరాయింపులు కూడా ఓ కారణమన్న వాదనా లేకపోలేదు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన ప్రజాప్రతినిధుల్లో ఒక్కరంటే ఒక్కరూ గెలవలేకపోయిన వైనం చంద్రబాబుతో సహా విశ్లేషకులను షాక్ గురి చేసిందని చెప్పాలి. ఏదో పొడిచేస్తారని తీసుకుని వస్తే.. వారు గెలవలేకపోగా... టీడీపీ ఘోర పరాజయంలో భాగమైపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అదికారంలోకి వచ్చిన జగన్ కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరిధర రావులు టీడీపీ నుంచి వేరుపడి వైసీపీకి దగ్గరైపోయారు. టీడీపీని ఫిరాయించిన వీరు ముగ్గురు అనర్హత వేటును తప్పించుకునేందుకు టీడీపీలోనే కొనసాగుతున్నా.. వీరు వైసీపీలోకి చేరిపోయినట్టే లెక్క.

ఇక మరో మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత శిద్ధా రాఘవరావు కూడా టీడీపీ నుంచి వేరుపడి వైసీపీకి చేరవయ్యే పనిలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శిద్ధాతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నట్లుగా సమాచారం. మరి నాడు వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను వ్యతిరేకించిన జగన్... ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తుంటే.. ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు అన్న ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా నాడు ఫిరాయింపులు టీడీపీకి దెబ్బేస్తే.. నేటి ఫిరాయింపులు భవిష్యత్తులో వైసీపీకి కూడా దెబ్బేసేవేగా అన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Next Story