మహానాడు వేళ బాబుకు జగన్ మార్కు గిప్టు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 6:35 AM GMT
మహానాడు వేళ బాబుకు జగన్ మార్కు గిప్టు.!

అనుకున్నట్లే జరిగింది. మహానాడు వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మ తిరిగే గిఫ్టు ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన రాజకీయ ప్రత్యర్థి విషయంలో కటువుగా ఉండే ఆయన.. సంబంరంగా చేసుకునే మహానాడులో తన మార్కు షాక్ తగిలేలా జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. మహానాడుకు ముందు.. కొందరు తెలుగు తమ్ముళ్లు పార్టీని వీడిపోతారన్న ప్రచారం సాగింది.

లాక్ డౌన్ వేళ.. ప్రజల కష్టాల్ని పట్టించుకోకకుండా పార్టీలు మారటాన్ని ప్రజలు అంగీకరించే అవకాశం లేదు. అందుకే.. ఆ నిర్ణయానికి వాయిదా వేసుకున్న తమ్ముళ్లు.. అధినేతకు మరోలా షాకిచ్చారు. మహానాడు కార్యక్రమాల్లో భాగంగా కొన్ని తీర్మానాల్ని ప్రవేశ పెట్టటం.. వాటిపై చర్చలు జరిపి.. ప్రభుత్వాన్ని విమర్శించటం లాంటివి చేస్తారు. ఇందులో భాగంగా ధరల పెంపు అంశంతో పాటు ప్రజలపై రూ.50వేల కోట్ల భారం అనే రెండు కీలక అంశాల్ని ప్రవేశ పెట్టే బాధ్యతను ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్.. కోట్ల సుజాతమ్మ.. సంధ్యారాణికి అప్పజెప్పారు.

ఈ ముగ్గురు ఆ తీర్మానాల్నిప్రవేశ పెట్టకుండా డుమ్మా కొట్టటం కలకలం రేపింది. తీర్మానాన్ని ప్రవేశ పెట్టే సమయానికి పత్తా లేకుండా పోయిన సత్యప్రసాద్ దెబ్బతో.. ఆయన ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పెట్టి మమ అనిపించారు. దీంతో.. త్వరలో జంపింగ్ లు స్టార్ట్ కావటం ఖాయమన్న మాట వినిపించింది. వీరే కాదు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా మహానాడు సందర్భంగా యాక్టివ్ గా పాల్గొని తన మీద జరిగే ప్రచారం తప్పని తేల్చలేదు. వీరితో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజు కూడా జంప్ అయ్యే వారి జాబితాలో వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. మహానాడు వేళ జగన్ మార్కు గిఫ్టు బాబుకు అందిందని చెప్పకతప్పదు.

Next Story