కొత్త విద్య మొదలెట్టిన చంద్రబాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 11:27 AM GMT
కొత్త విద్య మొదలెట్టిన చంద్రబాబు

రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలే. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా.. అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు శభాష్ అనేంత విశాలమైన మనసు ఎవరికి ఉంటుంది? రాజకీయం అంటేనే.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు కసుక్కున ఆరోపణల పోటు పొడవాలనుకోవటమే తప్పించి.. తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా ఒప్పుకునే మైండ్ సెట్ ఎంతమందికి ఉంటుంది చెప్పండి?

ఎక్కడి దాకానో ఎందుకు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 108 అంబులెన్సుల్ని అందుబాటులోకి తేవటమే కాదు.. ఫోన్ చేసినంతనే ఉరుకులు పరుగులు మీద వచ్చి.. వైద్యసాయం అందించే విధానాన్ని అప్పటి ప్రతిపక్ష నేత ఎప్పుడైనా అభినందించటం చూశారా? కొంతలో కొంత నయం ఏమంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత అయినా మెచ్చుకున్నారు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పొగిడిందే లేదు.

ఎంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినా.. బాగుందన్న మాట రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి రాదు. కానీ.. అందుకు భిన్నంగా తమకే మాత్రం సంబంధం లేని విషయాల్ని అంటకక్కే తీరు కొందరు నేతల్లో ఉంటుంది. తాజాగా ఆ తీరునే ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. మాయదారి రోగం ప్రపంచాన్ని వణికిస్తున్న వేళలో.. ప్రజలు.. ప్రతిపక్షాలన్ని దాని మీద ఫోకస్ పెట్టేస్తున్న వేళ.. సందట్లో సడేమియా అన్నట్లుగా కేంద్రం ఈ మధ్యన ఎడాపెడా నిర్ణయాల్ని తీసేసుకుంటోంది.

ఇటీవల తీసుకున్న చాలా నిర్ణయాల్ని సింఫుల్ గా చెప్పాలంటే.. కేంద్రం కర్రపెత్తనం ఎక్కువగా.. రాష్ట్రాలకున్న స్వేచ్ఛకు.. దానికుండే అధికారాలకు కత్తెర వేసినట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్రం మీద ఒంటి కాలి మీద విరుచుకుపడి.. రాష్ట్రాలకున్న అధికారాల్ని తగ్గించేస్తున్నారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయటాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ అధినేత కాస్త సిత్రమైన వాదనను వినిపించారు.

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లు మీద మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్ సర్కారు పీపీఏల (విద్యుత్ కంపెనీలతో బాబు సర్కారు చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేయటం.. సమీక్షించటం) విషయంలో అనుసరించిన తీరుతోనే మోడీ సర్కారుకు కొత్త ఆలోచనలు వచ్చినట్లుగా చెప్పటం విశేషం. జగన్ సర్కారు చేసిన నిర్వాకాలతోనే కేంద్రం ఇలాంటి తీరును ప్రదర్శిస్తుందన్న కొత్త వాదనను వినిపించారు.

ఒకవేళ బాబు చెప్పినట్లే.. ఒక రాష్ట్రం తప్పు చేసిందనే అనుకుందాం? దానికే కేంద్రం రంగంలోకి దిగి.. ఆ రాష్ట్రానికి బుద్ది చెప్పేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సురుకుపుట్టేలా నిర్ణయాలు తీసుకుంటారా? అన్నది ప్రశ్న. సాధారణంగా రాష్ట్రాలకు ముకుతాడు వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే.. అలాంటి వాటిని ప్రాంతీయ పార్టీల అధినేతలు తప్పు పడతారు.

అందుకు భిన్నంగా కేంద్రాన్ని వెనకేసుకు వస్తూ.. ఏపీ సర్కారును విమర్శించటం చూస్తే.. ఈ కొత్త కళ బాబులో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విపక్షంలో ఉన్న వేళ.. మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన బాబు.. ఇలా అడ్డదిడ్డమైన వాదనను వినిపిస్తే ఉన్న ఇమేజ్ కూడా పోతుందన్న విషయాన్ని బాబుకు ఎవరు చెబుతారు.?.

Next Story