‘ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’
తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది
By - Medi Samrat |
తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఏదైనా సంభాషణ లేదా టెలిఫోన్ సంభాషణ ఉందా అని రణధీర్ జైస్వాల్‌ను అడగగా.. దీనిపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. నిన్న ఇద్దరు నేతల మధ్య ఎలాంటి సంభాషణ జరిగినట్లు నాకు తెలియదు. అస్థిర ఇంధన పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే మా ప్రాధాన్యత అని గురువారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వివాదంపై భారత్ వైఖరిని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. మూడు విషయాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఒకటి, పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు స్పాన్సర్ చేస్తుంది. రెండవది, తన అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాకిస్తాన్‌కు పాత అలవాటు. మూడవది, ఆఫ్ఘనిస్తాన్ తన ప్రాంతాలపై సార్వభౌమాధికారాన్ని ఉపయోగిస్తోందని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాబూల్‌లో మాకు సాంకేతిక మిషన్ ఉందని, ఈ సాంకేతిక మిషన్ నుండి రాయబార కార్యాలయానికి మారడం రాబోయే కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు.