నేను మాట్లాడితే.. విశాల్ నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 1:53 PM IST
నేను మాట్లాడితే.. విశాల్ నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది

విశాల్ సంస్థలో పని చేస్తున్న ఓ మహిళ పెద్ద మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరు సంవత్సరాలలో రమ్య అనే మహిళ 45లక్షల రూపాయలు కాజేసిందని విరుగంబాకమ్ పోలీసు స్టేషన్లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ మేనేజర్ ఇటీవలే ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు డబ్బులు కట్టకుండా తన సొంత అకౌంట్ కు డబ్బులను బదిలీ చేసుకుందని మేనేజర్ తెలిపాడు. ఆ డబ్బులతో ఈ మధ్యనే రమ్య ఇల్లు కొనిందంటూ మేనేజర్ ఆరోపించాడు.

తనపై వచ్చిన ఆరోపణలపై రమ్య ఘాటుగా స్పందించింది. విశాల్ కంపెనీ డబ్బులను తన అకౌంట్ కు, తన కుటుంబ సభ్యుల అకౌంట్ కు తరలించానని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి విశాల్ తనను పర్సనల్ గా అడిగి ఉండి ఉంటే.. తప్పకుండా క్లారిటీ ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. విశాల్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా ఫండ్ డబ్బులు కావాలని అడిగేవాడు.. అప్పుడు తాను వేరే అకౌంట్స్ నుండి పంపించేదాన్ని అని తెలిపింది రమ్య.

కంపెనీ అకౌంట్ కు నెట్ బ్యాంకింగ్ వంటివి లేకపోయినప్పుడు తన అకౌంట్ కు పంపించి వాటి ద్వారా బిల్లులు కట్టానని రమ్య క్లారిటీ ఇచ్చింది. తన స్థానంలో ఇంతకు ముందు పని చేసిన వారిలా తాను కూడా పని చేశానని ఆమె తెలిపింది. పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అని, అందుకు సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది.

తన దగ్గర ఉన్న వివరాలన్నీ చెబితే, విశాల్ నిజస్వరూపం బయట పడుతుందని హెచ్చరించింది. తాను ఎవరినీ మోసం చేయలేదని రమ్య. తాను ఇంతకాలమూ ఎంతో సైలెంట్ గా ఉన్నానని, ఇప్పుడు తనపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని తెలిపింది. తాను నోరు విప్పితే విశాల్ విషయం అందరికీ తెలుస్తుందని.. మహిళను కావడం వల్లే నన్ను బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

జూన్ 10వ తేదీన సమస్య మొదలైందని.. ఇన్ని రోజులూ దీని మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆమె ప్రశ్నించింది. 5 రోజుల పాటూ తాను ఎంతో డిప్రెషన్ లో ఉన్నానని జూన్ 15న ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపింది. జూన్ 20న విశాల్ అడ్వొకేట్ హరి కృష్ణన్ మరో ఇద్దరితో కలిసి తన ఇంటికి వచ్చాడు. వారు తన ఇళ్లంతా వెతికారు. కొన్ని ముఖ్యమైన పత్రాలు, పెన్ డ్రైవ్ ఆఫీసులో కనిపించకుండా పోయాయని అందుకే వెతుకుతున్నామని సమాధానం ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది.

వారు తన ఇంటినంతా వెతుకుతూ ఉంటే భయపడి వారు అడిగిన డాక్యుమెంట్లను ఇచ్చేశానని తెలిపింది. జూన్ 24న ఆఫీసుకు రమ్మన్నారని.. నలుగురు గూండాలు తనను బెదిరించి కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. అందులో ఏమి రాశారో కూడా తనకు తెలీదని.. సాక్షి సంతకం కింద తన తండ్రితో చేయించారని ఆమె తెలిపింది. తనకు ఏమి జరుగుతోందో కూడా తెలీదని.. తాను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోగలనని ఆమె తెలిపింది. విశాల్ తనను చంపాలని అనుకుంటూ ఉన్నాడని.. అందుకోసం గూండాలను కూడా మాట్లాడాడని తనకు అనిపిస్తూ ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆఫీసులో ఎన్నో పంచాయతీలు జరగడాన్ని తాను చూశానని.. విశాల్ కు ఎదురుగా ఎవరైనా నిలిస్తే హరి వాళ్ళను ఆఫీసుకు తీసుకుని వచ్చి చిత్రహింసలు గురిచేయడాన్ని తాను చూశానని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. విశాల్ ఒక పెద్ద విలన్ అని.. అతడు చేయబోయే మోసంలో నన్ను బలిపశువుగా చేయాలని భావిస్తూ ఉన్నాడని ఆమె తెలిపింది. విశాల్ మనుషులు చివరికి తన కారును కూడా లాగేసుకున్నారని ఆమె ఆరోపించింది.

విశాల్ ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తూ ఉన్నాడు. చక్ర, డిటెక్టివ్-2 సినిమాలలో నటిస్తూ తన సొంత సంస్థ తరపున నిర్మాణం చేస్తున్నాడు. ఇటీవలే చక్ర సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా ఇంటర్నెట్ ద్వారా జరిగే మోసాల గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, రెజీనా కసాండ్రాలు కీలక పాత్రల్లో నటించారు.

Next Story