లాక్‌డౌన్‌పై మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారు..?
By సుభాష్ Published on 13 April 2020 3:28 PM ISTకరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కోరలు చాస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్న దేశం ఏప్రిల్ 14తో ముగియనుంది. దీంతో రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన అన్ని రాష్ట్రాలు మోదీని కోరిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాయి.
అయితే మోదీ లాక్‌డౌన్‌పై ఎలాంటి ప్రసంగం ఉండబోతోందనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. పూర్తిస్థాయిలో మళ్లీ లాక్‌డౌన్ పొడిగిస్తారా..? లేక సడలిస్తారా..? అనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. దేశంలో ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, హైలెవల్ కమిటీలతో చర్చలు జరిగాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్న దేశం.. మరిన్ని వారాలు పొడిగిస్తే ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయోమోనన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ కాకుండా జోన్‌లుగా విభజించి లాక్‌డౌన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మూడు జోన్‌లుగా అంటే రెడ్‌జోన్, ఆరేంజ్‌జోన్, గ్రీన్ జోన్‌లుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. రెడ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించి, ఎవ్వరిని బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు. ఆరేంజ్ జోన్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ కాకుండా కొంత సడలింపు ఇవ్వనున్నారు. గ్రీన్‌జోన్‌లో కొంత మేర నిబంధనలు విధించి లాక్‌డౌన్‌ను సడలించనున్నారు. ఇలా జోన్‌ల వారీగా లాక్‌డౌన్‌పై స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మరికొన్ని రంగాలపై మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.