కరోనాతో అమెరికాలో గంటకు ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

By సుభాష్  Published on  13 April 2020 9:34 AM GMT
కరోనాతో అమెరికాలో గంటకు ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

ముఖ్యాంశాలు

  • అమెరికాలో మృతి చెందిన వారు 22 వేల మంది

  • ప్రతి గంటకు 83 మంది మృతి

  • చికిత్స పొందుతున్న 25 లక్షల మంది

అమెరికాలో క‌రోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మ‌ర‌ణ‌మృందంగం మోగిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఆదివారం నాటి వ‌ర‌కూ 22వేల మంది మృత్యువాత ప‌డ్డారు. ప్రతి గంట‌కూ సుమారు 83 మంది చ‌నిపోతున్నార‌ని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. భారీ మొత్తంలో సైన్యాన్ని రంగంలోకి దింపి కరోనా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా.

చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌.. ఇతర దేశాలన్నింటికి చాపకింద నీరులా పాకేసింది. మొదట పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండో స్థానంలో ఇటలీ ఉండేది. ఇక చైనాను దాటేసిపోయిన ఇటలీ మొదటి స్థానంలో చేరగా, ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికా మొదటి స్థానంలో చేరిపోయిందంటే పరిస్థితి ఏ మేరకు దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల పెద్దన్నగా, అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది.

ఇంత టెక్నాలజీ ఉన్న అమెరికా దేశం కంటికి కనిపించని శత్రువును ఏమి చేయలేకపోతోంది. కరోనా వల్ల అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. మున్ముందు పరిస్థితి తీవ్ర తరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనాను అరికట్టేందుకు ట్రంప్‌ ముందు నుంచి చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎలాంటి సమయంలోనైనా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రగల్బాలు పలికిన ట్రంప్‌కు గట్టి షాకిచ్చినట్లయింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థతి నెలకొంది. కరోనాతో అమెరికా మరింత ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కారణాలివి..

గత మూడు వారాల్లో అమెరికా ప్రజలు ఇష్టమొచ్చినట్లుగా తిరిగారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కాకుండా తిరగడంతో ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ముందే హెచ్చరించారు. కానీ ట్రంప్‌ వారి మాటలను పెడచెవిన పెట్టేశారు. వచ్చే రెండు వారాల్లో ఈ కేసులన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Next Story