తెలంగాణలో తలసాని.. ఏపీలో డొక్కా.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 6:11 AM GMT
తెలంగాణలో తలసాని.. ఏపీలో డొక్కా.!

రాజకీయ నేత అన్న తర్వాత పార్టీ మారటం మామూలే. ఇవాల్టి రోజున అది మరీ చాలా సింఫుల్ గా మారింది. ఉదయం ఒక పార్టీలో మధ్యాహ్నం మరో పార్టీలోకి మారిపోయిన ఉదంతాలు ఎన్నో చూశాం. పార్టీ మారిన అందరి నేతల తలరాత ఒకేలా ఉంటుందని అస్సలు అనుకోకూడదు. తెలంగాణ విషయానికే వద్దాం. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినోళ్లు.. జంప్ అయినోళ్లకు లెక్కే లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చినోళ్లు ఎంతోమంది ఉన్నా.. మంత్రి తలసాని మాదిరి సుడి ఉన్నోళ్లు మాత్రం పెద్దగా కనిపించరు. కేసీఆర్ లాంటి అధినేత మనసు దోచుకోవటం.. వేరే పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ.. మంత్రి పదవిని చేపట్టటం..అంటే మాటలా?అందునా.. నరసింహన్ లాంటి గవర్నర్ పదవిలో ఉన్న వేళలో ఇలాంటి సాధ్యం కావనే అనుకుంటాం.

కానీ.. అందుకు భిన్నంగా ఎవరూ ఊహించని రీతిలో పార్టీ మారిన గంటల్లోనే.. మంత్రి పదవిని చేజిక్కించుకోవటం లాంటివి తలసానికి మాత్రమే సొంతం. అలాంటి సుడి అందరికి ఉండదు. పార్టీ మారే సమయంలో ఇచ్చే హామీలకు.. పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే వాటికి పోలికే ఉండదు. తలసాని లాంటి ప్రత్యేక కేసులు చాలా తక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఆయన మాదిరే ఏపీలోనూ అలాంటి నేత ఎవరైనా ఉన్నారంటే.. అది దళిత నేతగా సుపరిచితుడు.. దివంగత నేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడు.. ఆయనేం చెబితే అది చేసేసే నేతగా పేరున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ గా చెప్పాలి.

కాంగ్రెస్ లో ఉండి తర్వాతి కాలంలో టీడీపీలో చేరిన ఆయన.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరీ చేరగానే పదవి కన్ఫర్మ్ కావటం చాలా తక్కువమందికే సాధ్యం. అలాంటి మేజిక్ డొక్కా సొంతం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ సర్కారు స్టాండ్ కు అండగా నిలిచిన ఆయన.. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ అవకాశాన్ని సొంతం చేసుకోవటం.. జగన్ లాంటి అధినాయకుడి మనసు దోచుకోవటం మామూలు విషయం కాదు. ఏమైనా డొక్కా మహా అదృష్టవంతుడని మాత్రం చెప్పక తప్పదు.

Next Story