ప్రెస్ మీట్‌లో జగన్‌కు ఆ ప్రశ్న వేయాలన్న ఫైర్ బ్రాండ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 5:45 AM GMT
ప్రెస్ మీట్‌లో జగన్‌కు ఆ ప్రశ్న వేయాలన్న ఫైర్ బ్రాండ్

మాయదారి రోగం మీదకు వచ్చేసిన వేళలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మహమ్మారికి ప్రముఖుడు.. సామాన్యుడన్న తేడా లేదు. చటుక్కున పట్టేసి... లటుక్కున దూరేసే దరిద్రపు గుణం చాలా.. చాలా ఎక్కువన్నది మర్చిపోకూడదు. పాజిటివ్ గా నమోదైన వారిలో అత్యధికులు ఎక్కడో ఏదో ఒక తప్పు చేయటమో.. నిర్లక్ష్యం చేసిన వారే తప్పించి మరెవరూ మహమ్మారి బారిన పడలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. గడిచిన కొంతకాలంగా అందరూ తప్పనిసరిగా ముఖానికి మాస్కులు పెట్టుకోవాలన్న సూచనను చేశారు.

కొన్ని రాష్ట్రాల్లో అయితే.. ముఖానికి మాస్కు పెట్టుకోకుండా బయటకు వస్తే వారికి భారీ జరిమానాను విధిస్తున్నారు. దేశ ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి కొందరు ముఖానికి మాస్కు పెట్టుకోకున్నా.. తమ భుజానికి ఉండే కండువాను.. మాస్కుగా వినియోగిస్తున్నారు. వీరికి భిన్నంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం భిన్నంగా నిలుస్తున్నారు.

రాష్ట్రానికి పెద్దగా ఉండే వ్యక్తి.. ప్రజలంతా తప్పనిసరిగా చేయాల్సిన పనిని.. ముందు తాను చేసి చూపించాలన్న చిన్న పాయింట్ ను జగన్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఆయన తన ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరన్న విషయం ఆయన్నుచూస్తేనే అర్థమవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసమో.. తనకేమీ కాదన్న తెగింపో కానీ.. జగనన్న ఇప్పటివరకూ మాస్కు పెట్టుకోలేదు. ఆయన్ను చూసిన చాలామంది తమకు మాస్కుఅవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

ఏపీ ఫైర్ బ్రాండ్ నేత ఉండవల్లి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ మాస్కులు పెట్టుకోవాలన్న నిబంధన పెట్టారని.. కానీ జగన్ మాస్కు పెట్టుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎందుకు మాస్కులు పెట్టుకోరో ప్రెస్ మీట్లో అడగాలని ఆయన సూచించారు. తాను బయటకు వచ్చినప్పుడు చాలామందిని చూస్తున్నానని.. వంద మందిలో పది మంది మాత్రమే మాస్కులు పెట్టుకుంటున్నారన్నారు. జగన్ ను చూసి ప్రజలు ప్రభావితం అవుతున్నట్లుగా చెప్పిన ఉండవల్లి మాట.. జగన్ వరకూ వెళ్లే ఛాన్సు ఉందంటారా?

Next Story
Share it