పిరికితనం అంటున్నారు.. అప్పుడెందుకు ఆ పని చేశారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 10:02 AM GMT
పిరికితనం అంటున్నారు.. అప్పుడెందుకు ఆ పని చేశారు?

షాకుల మీద షాకులు తగులుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబుకు. పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఒకరి తర్వాత ఒకరు చొప్పున పార్టీని వీడుతున్న వైనాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన నోటి నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తున్నాయి. వినేందుకు బాగానే ఉన్నా.. తాను పవర్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని ప్రస్తావిస్తూ.. సంధిస్తున్న ప్రశ్నలు బాబు మాటల్ని తేలిపోయేలా చేస్తున్నాయి.

తాజాగా పార్టీకి చెందిన సీనియర్ నేత.. బాబు మాటకు అపర విధేయుడిగా పేరున్న శిద్దా రాఘవరావు పార్టీని వీడటంపై స్పందించారు. తన మాట కోసం కోట్లాది రూపాయిల్ని నష్టపోయిన శిద్దా పార్టీని వీడటం బాబును ఎంత బాధకు గురి చేసిందో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి. దశాబ్దాలుగా పార్టీలోపదవులు.. గౌరవం పొందిన వారు ఇప్పుడు అధికార పార్టీ వేధింపులకు భయపడి పార్టీ మారటం సరికాదంటున్నారు.

‘‘అది పిరికితనం. అలా పార్టీ మారతారా? ఒకరిద్దరు పోయినా ఏమీ కాదు. టీడీపీ రాజకీయ వర్సిటీ. నాయకుల్ని తయారు చేసే కార్ఖానా. రాబోయే నలభైఏళ్ల కోసం ధీటైన.. సమర్థ నాయకత్వాన్ని తయారు చేస్తా. ఆ ఓపిక నాకుంది. బాథ్యత నాపై ఉంది’’ అన్న బాబు మాటలు వినేందుకు బాగుంటాయని చెబుతున్నారు. బాబు చెప్పినట్లుగా గడిచిన ఏడాది కాలంలో ఒకరిద్దరు కాదు.. పదుల సంఖ్యలో నేతలు పార్టీని వీడిపోయిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

ఏదో మాట వరసకు ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారని.. కానీ.. వెళ్లిపోయిన వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని బాబు మాటలు ప్రజల్ని మర్చిపోయేలా చేయమని చెబుతున్నారు. పార్టీ వీడిన వారు పిరికివారుగా అభివర్ణిస్తున్న బాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు గాలం వేసి ప్రత్యర్థి పార్టీ నుంచి తీసుకొచ్చిన నేతలు కూడా పిరికివారే కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

ఒకరు పోతే వందమందిని తయారు చేస్తామని చెప్పే బాబు.. గడిచిన ఏడాదిలో పోయిన నేతలకు ధీటుగా ఇప్పటివరకూ ఒక్క నేతైనా తయారు చేశారా? అన్న ప్రశ్నను వేసుకుంటే.. బాబు మాటల్లో హడావుడి తప్పించి.. అందులో అర్థమే లేదని చెప్పక తప్పదు. అవసరానికి మించిన ఆవేశాన్ని ప్రదర్శించే కంటే.. కామ్ గా ఉండటానికి మించింది లేదన్న మాట వినిపిస్తోంది. చేయాల్సిన తప్పులు ఎన్నో చేసిన బాబు.. ఇప్పుడిలా మాట్లాడటం సరికాదన్న మాటలో నిజముందని చెప్పక తప్పదు.

Next Story