జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ.. ఇప్పుడప్పుడే ముగిసేలా లేదే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 2:44 AM GMT
జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ.. ఇప్పుడప్పుడే ముగిసేలా లేదే

ఏపీలో ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారానికి సంబంధించి నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. తన మాట కాదని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎస్ఈసీ పదవి నుంచి జగన్ సర్కారు తొలగిస్తే.. తనను తొలగించేందుకు ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమంటూ నిమ్మగడ్డ హైకోర్టు గడప తొక్కారు. రెండు రోజుల క్రితం హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రాగా.. దానిని కూడా జగన్ సర్కారు తిప్పికొట్టింది. ఈ క్రమంలో నిన్న రాత్రి మునుపెన్నడూ లేని రీతిలో అడ్వొకేట్ జనరల్ మీడియా ముందుకు రాగా... తాజాగా ఆదివారం నిమ్మగడ్డ కూడా మీడియాను ఆశ్రయించారు. వెరసి ఈ వివాదం మరింత రాజుకుందనే చెప్పాలి.

రాష్ట్రం చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు సిద్ధం కాగా... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసి ఆ తర్వాత కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై భగ్గుమన్న వైసీపీ సర్కారు.. నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తొలగించేసి వెనువెంటనే మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ఇరువర్గాల మద్య మరింత వేడి రాజుకుంది. తనను పదవి నుంచి తొలగించేందుకు జగన్ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టులో సవాల్ చేసిన నిమ్మగడ్డ తనదే పైచేయి అని నిరూపించుకోగా... నిమ్మగడ్డ స్పీడుకు బ్రేకులేస్తూ జగన్ సర్కారు ఏకంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యంను మీడియా ముందుకు ఎంట్రీ ఇప్పించేసింది. ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న నిమ్మగడ్డ... ఓ రోజంతా ఆలోచించి తాను కూడా మీడియా ముందే తన వాదనను వినిపించేందుకు వచ్చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదనలు, ప్రతివాదనలు హోరెత్తుతున్నాయి. మొత్తంగా ఈ వివాదం నువ్వా, నేనా అన్నట్టుగానే సాగుతున్నాయి.

అసలు నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు చెప్పలేదంటూ శనివారం ఏజీ శ్రీరామ్ మీడియా ముందుకు రాగా... తాాజాగా ఆదివారం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసిన నిమ్మగడ్డ... తనను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని వాదించారు. హైకోర్టు చెప్పినా కూడా జగన్ సర్కారు తన మొండిపట్టు వీడకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని నిమ్మగడ్డ తన పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో తాను ఏమాత్రం వెనకడుగు వేసేది లేదన్నట్లుగా కూడా నిమ్మగడ్డ తేల్చి చెప్పినట్టైంది. మరోవైపు జగన్ సర్కారు కూడా ఈ వ్యవహారంలో తాను కూడా వెనకడుగు వేసేది లేదని, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని ప్రకటించింది. మొత్తంగా ఈ వ్యవహారంపై ఇరు వర్గాలు తమదైన వాదనలకే కట్టుబడిన నేపథ్యంలో ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదని చెప్పక తప్పదు.

Next Story