విశాఖ.. కర్నూలు రెండు ఒకేసారి జరగవా?
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Aug 2020 6:35 AM GMTఏపీకి ఒక రాజధాని అయితే ఏం బాగుంటుందని.. మూడు రాజధానులు చేస్తామన్న మాట చెప్పటమే కాదు.. తన ఆలోచనను వాస్తవరూపంలోకి తేవటంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే. ప్రస్తుతానికి న్యాయ సంబంధమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నా.. అవన్నీ త్వరలోనే తీరిపోతాయన్న నమ్మకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే తాము విశాఖకు రాజధానిని తరలించే కార్యక్రమాన్ని చేడపతామని.. త్వరలోనే విశాఖ రూపురేఖలు మారేలా ప్రణాళికల్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల నోటి నుంచి విశాఖ గురించి అదే పనిగా ప్రస్తావిస్తున్నారు కానీ..మరో రాజధాని అయిన కర్నూలు ఊసు చాలా తక్కువగా వినిపించటాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ సీమకే నష్టం వాటిల్లుతుందన్న మాట గడిచిన కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఏపీ మంత్రుల మాటల్ని చూసినప్పుడు.. ఏపీ రాజధానిగా విశాఖ గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్న వారు.. కర్నూలు గురించి మాత్రం మాట్లాడకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకిలా? అన్నది ప్రశ్న. దీనికి సమాధానంగా.. ఏపీ అధికారపక్ష ఎజెండాలో విశాఖ మీద ఎక్కువ ఫోకస్ ఉందని చెబుతున్నారు. మూడో రాజధానిగా తాము ప్రకటించిన కర్నూలుకు ముందుగా హైకోర్టును తరలించాల్సి ఉంటుందని.. అందుకు ఇప్పుడే కుదరదని.. మరింత సమయం పడుతుందని చెబుతున్నారు.
విశాఖకు రాజధానిని తరలించే విషయంలో ఎదురయ్యే చిక్కుల కంటే.. కర్నూలును న్యాయరాజధానిగా తీర్చిదిద్దటంలో సవాళ్లు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. అందుకే.. ప్రస్తుతానికి దాని జోలికి వెళ్లకుండా.. విశాఖ మీద ఫోకస్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే.. విశాఖలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడే ఏపీ అధికారపక్ష నేతలు ఎవరూ కూడా.. కర్నూలు రాజధానిగా భూమిపూజ మాటను అస్సలు తీసుకురావటం లేదన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. ఈసారికి కూడా మూడు రాజధానుల ఎపిసోడ్ లో కర్నూలు పులుసులో ములక్కాయ కానుందా? అన్నది సందేహంగా మారింది. మరీ విషయంలో ఏపీ సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.