ఏపీ సీఎం జగన్ కు కొత్త సవాలు.. మంత్రి అవంతి లైన్ క్రాస్ చేశారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2020 5:23 AM GMTమనసులో కష్టం ఉంటే అధినేతకు అత్యంత సన్నిహితుడితో చెప్పుకోవాలి. సమస్య ఉంటే పంచుకోవాలి. అంతే తప్పించి.. ఎప్పుడూ.. ఎక్కడా బయటపడకూడదు. ప్రాంతీయ పార్టీల్లో ఈ రూల్ అప్రకటితంగా ఉంటుంది. అందుకే.. మనసులో బాధ ఉన్నా.. కోపం ఉన్నా.. వాటిని మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసినా.. అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటివాటికి టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త మినహాయింపుగా చెప్పాలి. కొందరు ఫైర్ బ్రాండ్లు తమకు నచ్చిన అంశాలపై చెలరేగిపోయి మాట్లాడినా.. వారి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించటం.. మరీ ఎక్కువ అవుతుందన్న భావన కలిగినప్పుడు.. వారిని పిలిపించుకొని మాట్లాడి కౌన్సెలింగ్ చేసి పంపటం బాబు స్టైల్.
అందుకు భిన్నంగా దగ్గరకు కూడా రానివ్వకుండా వారి సంగతి చూసే అలవాటు ఏపీ ముఖ్యమంత్రి కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమని చెబుతారు. ఈ కారణంతోనే.. పార్టీకి సంబంధించి.. ఏదైనా బాధ.. వేదన ఉంటే మనసులోనే దాచుకోవటం లేదంటే జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే విజయసాయిరెడ్డికో.. వైవీ సుబ్బారెడ్డి లాంటివారికో చెప్పుకోవటమే కాదు.. బయటపడే తీరు ఆ పార్టీలో పూర్తిగా నిషిద్ధం. ఈ తీరుకు భిన్నంగా మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అనుసరించిన వైఖరి పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి గంటాకు.. మంత్రి అవంతి శ్రీనివాస్ కు మధ్యనున్న పంచాయితీ తెలిసిందే. వారిద్దరికి ఏ మాత్రం పొసగదు. తాజాగా ఏపీ అధికారపార్టీలోకి రావాలని గంటా తపిస్తున్నారు. ఆ మాటకు వస్తే.. గడిచిన కొద్ది నెలలుగా ఈ ప్రయత్నాలు సాగుతున్నా.. ఎంట్రీకి అవకాశం లభించని పరిస్థితి. ఏవో ఒక అవంతారాలు ఆయన్నుపార్టీలోకి రాకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా పార్టీలోకి వచ్చేందుకు డేట్ డిసైడ్ చేసుకున్నారన్న వార్తలు బయటకు వచ్చినంతనే.. పార్టీ అధినేత గీసిన లైన్ ను క్రాస్ చేసి మరీ అవంతి మాష్టారు గళం విప్పారని చెబుతున్నారు.
కేసుల మాఫీ కోసమే గంటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతి.. దొడ్డిదారిన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గంటా ఉంటారని ఫైర్ అయిన ఆయన.. అధికారం లేకపోతే గంటా ఉండలేరన్నారు. భూ కుంభకోణాలతో పాటు.. సైకిళ్ల కుంభకోణంలో గంటా పాత్ర ఉందన్నారు.
ఈ కుంభకోణాల గురించి తాను ఇప్పటికే విజయసాయిరెడ్డికి కంప్లైంట్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ నెల 9 కానీ 15న కానీ గంటా అధికార పార్టీ కండువా కప్పుకుంటారన్న వార్తలు వస్తున్న వేళ.. దానికి చెక్ పెట్టేలా ఒక అడుగు ముందుకేసిన మంత్రి అవంతి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలాంటి పరిస్థతుల్లో గంటా పార్టీలోకి రావటం సాధ్యమేనా? అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి భిన్నంగా అవంతి శ్రీనివాస్ వైఖరి పార్టీ లైన్ ను క్రాస్ చేసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి గంటా పార్టీ ఎంట్రీ.. అవంతి ఆగ్రహాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడో ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.