రేపటిలోగా చెప్పకుంటే మేమే ఆదేశాలిస్తాం.. సర్కారుకు హైకోర్టు గడువు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 July 2020 6:01 PM ISTఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి అదే పనిగా హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని న్యాయస్థానం తప్పు పట్టే పరిస్థితి. వాస్తవానికి ప్రభుత్వం తన తీరును కాస్త మార్చుకుంటే అసలు ఇబ్బందులే రాని పరిస్థితి. కానీ.. తాను అనుకున్నది మాత్రమే జరగాలన్నట్లుగా వ్యవహరించే ప్రభుత్వాధినేతతో తాజా పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా కేసుల గురించి.. మరణాల గురించి ఓపెన్ గా సమాచారాన్ని ఇచ్చేస్తున్నారు. గణాంకాల్ని అందరికి అందుబాటులో ఉంచుతున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం బులిటెన్ లో అన్ని వివరాల్ని మీడియాకు ఇచ్చేస్తున్నారు. అదేం సిత్రమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా సమాచారాన్ని గుట్టుగా ఉంచుతోంది. ఇప్పటికే ఇదే అంశాన్ని పదే పదే హైకోర్టు చెప్పినా.. తీరు మార్చుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా బాధిుతల సమాచారాన్ని ఎందుకంత గుట్టుగా ఉంచుతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పరీక్షల విషయంలోనూ ఇలాంటి అనుభవమే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురైంది.
నిజానికి ఇంత గుట్టుగా ఉంచాల్సిన అవసరం లేదు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తే.. ప్రజలు మరింత అప్రమత్తతో ఉండేందుకు వీలు కలుగుతుంది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది కేసీఆర్ సర్కారు. ఇదొక్కటే కాదు.. సచివాలయం కూల్చివేత విషయంలోనూ గుట్టుగా వ్యవహరిస్తోంది. కూల్చివేత సందర్భంగా ప్రభుత్వం మీడియాను అనుమతించటం లేదు. దాదాపు నాలుగు వందల మంది పోలీసుల పహరాలో ఎవరిని అనుమతించకుండా కూల్చివేతలు నిర్వహిస్తున్నారు.
దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే విచారణ జరిపింది. ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. వారం సమయం ఇవ్వాలన్న దానికి భిన్నంగా ఈ రోజునే ప్రభుత్వ స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేసింది. మీడియాను అనుమతించకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. దీనికి సమాధానంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ సెక్షన్ 180 ప్రకారం సైట్ లో పని చేసే వారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.
మరి.. కూల్చివేతల్లో గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించింది. కోవిడ్ మాదిరి కూల్చివేతల మీద కూడా బులిటెన్ విడుదల చేయొచ్చుగా అని ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వాన్ని సోమవారం అడిగి సమాచారం చెబుతానని ఏజీ చెప్పగా.. రేపటి (శుక్రవారం)కి గడువు ఇస్తామని.. ఒకవేళ ప్రభుత్వమే చెప్పకుంటే.. తామే ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సచివాలయం కూల్చివేత పనులు ఇప్పటికే 95 శాతం పూర్తి అయినట్లుగా పేర్కొన్నారు.