సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామక ఉత్తర్వులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2020 10:52 AM GMT
సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామక ఉత్తర్వులు

భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం తన వాగ్దానాన్ని ఆచరలో పెట్టింది. కల్నల్‌ సంతోష్ భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సరైన శిక్ష ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు సంతోషికి తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపి బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

అంతకముందు.. సంతోషికి హైదరాబాద్‌లో నివాస స్థలం అప్పగించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో కేబీఆర్‌ పార్క్‌కు ఎదురుగా ఉన్న రూ. 20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని సంతోష్‌ బాబు కుటుంబానికి కేటాయించారు. బుధవారం ఉదయం ఆ స్థలాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి పరిశీలించారు. అనంతరం ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్‌ భార్యకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు

Next Story