తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం ఎందుకు?

By సుభాష్  Published on  22 July 2020 6:05 AM GMT
తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం ఎందుకు?

ఎవరి పని వారు చేయాలి. ఫలానా వారు పని ఎందుకిలా చేస్తున్నారు? అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. కోర్టులు స్పందిస్తున్న తీరుతో ప్రభుత్వాలకు.. ప్రభుత్వ వ్యవస్థల్లో పని చేసే కీలక అధికారులకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. అదే సమయంలో తాము అందరికి బాధ్యులమన్న విషయాన్ని మరిచిపోయి.. ముఖ్యమంత్రి ముందుకు వెళ్లి తమను తాము సమర్థించుకుంటూ న్యాయస్థానాల మీద పితూరీలు చెప్పుకోవటం సంచలనంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి హైకోర్టు కోరుతున్న సమాచారాన్ని ఇచ్చే విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహంతో ఉంది. తాము ఎన్నిసార్లు చెప్పినా.. తమ తీరు మార్చుకోని అధికారులపై సీరియస్ అయ్యింది. ఈ సందర్బంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో.. ఉన్నతాధికారులు విలవిలాడిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట క్యూ కట్టారు. కరోనా కాలంలో క్షణం తీరిక లేకున్నా అధికారులు కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తోందని.. ఎక్కువ సమయం కోర్టు కార్యకలాపాల కోసం కేటాయించాల్సి వస్తోందని పేర్కొనటం గమనార్హం.

క్లిష్టమైన సమయంలో పని వదిలేసి విచారణకు సిద్ధం కావాల్సి వస్తోందని.. తాము చేస్తున్న విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నట్లుగా సీఎంవో విడుదల చేసిన ప్రెస్ నోట్ చూస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని.. కోర్టు కూడా ఏకంగా 87 పిల్స్ స్వీకరించినట్లుగా సీఎం నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారులు వెల్లడించినట్లుగా సీఎంవో ప్రకటన పేర్కొంది.

ఇదంతా చూసినప్పుడు ఉన్నతాధికారుల తీరుకు విస్మయానికి గురి కావాల్సిందే. కరోనా వేళ.. అంత తీరిక లేకుండా అధికారులు గడుపుతున్నారే అనుకుందాం? మరి.. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పనులు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగటం లేదు? అన్ని చోట్ల పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు జరుగుతుంటే.. తెలంగాణలో ఎందుకు నిర్వహించరు?

అంతదాకా ఎందుకు.. ఇన్ని రోజులు అయ్యాక.. కోర్టు పదే పదే చెప్పిన తర్వాత కూడా కరోనా బులిటెన్ లో సమాచారాన్ని ఎందుకు వెల్లడించనట్లు? తెలంగాణకు చుట్టు ఉన్న కర్ణాటక.. ఏపీ.. తమిళనాడు.. లాంటి రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్ర బులిటెన్ లో (ఈ మధ్యన కాస్తా మార్చారు) వివరాలు ఎందుకు వెల్లడించరు? రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యను ఇచ్చే బదులు.. ప్రాంతాల వారీగా మరణాల సంఖ్యను ఎందుకు ఇవ్వరు? ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకు దాచి పెడతారు? బులిటెన్ లో అన్ని వివరాలు ఇవ్వండన్న హైకోర్టు మాటను అమలు చేస్తే.. మళ్లీ మళ్లీ ఆ విషయం గురించి న్యాయస్థానం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కదా?

తమకు తాము పని చేయకపోగా.. కోర్టు ప్రశ్నిస్తే.. దాన్ని తప్పుగా అన్వయించుకోవటం.. ప్రత్యేక పరిస్థితి అంటూ అధికారులు వినిపిస్తున్న వాదనను చూసినప్పుడు.. మరి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మాటేమిటి? అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారి సంగతేమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన న్యాయవ్యవస్థను తప్పు పట్టే వరకూ ఉన్నతాధికారులు వెళ్లటం ప్రమాదకర సంకేతంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని న్యాయస్థానం కాకుండా మరెవరు ప్రశ్నించే వీలుంది? ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వదిలేసి.. తమను ఎవరూ ఏమీ అనకూడదన్నట్లుగా భావించటం ఎంతవరకు సబబు.. అని పలువురు అంటున్నారు.

Next Story