ఆమె కన్ను పడిన మగాడికి చుక్కలే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 July 2020 2:02 PM ISTకాలం మారింది. నిత్య పెళ్లి కొడుకు లాంటి టైటిల్స్ మగాళ్లకు మాత్రమే సొంతం. అది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమన్నది ఇప్పుడు వెలుగు చూస్తున్న వైనాల్ని చూస్తే తెలియక మానదు. ఎప్పటికప్పుడు తన ఐడెంటినీ మార్చేసుకొని మగాళ్లకు వల వేయటం.. వారిని బురిడీ కొట్టించటం.. ఆ తర్వాత ఇచ్చే షాకులతో ఎంతటోడైనా సరే ఉక్కిరిబిక్కిరి అయ్యే నేర్పు విప్పర్ల స్వప్న సొంతం. తాజాగా నాలుగో పెళ్లి చేసుకుంటూ అడ్డంగా బుక్ అయిన ఆమె వైనం ఇప్పడు సంచలనంగా మారింది.
నిత్య పెళ్లి కూతురిగా వ్యవహరిచే ఆమెను తాజాగా ప్రకాశం జిల్లా దొనకొండలో అరెస్టు చేశారు. నాలుగో పెళ్లికి సిద్ధమైన ఆమెను అదుపులోకి తీసుకోవటం ద్వారా ఒక మగాడు ఆమె టార్చర్ నుంచి మిస్ అయినట్లేనని చెబుతున్నారు. ఆమె చరిత్రను తవ్వి తీసిన పోలీసులు సైతం విస్మయానికి గురి అవుతున్నారు.
తిరుపతిలోని ఒక హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేసే స్వప్న తొలుత తన మేనమామను పెళ్లాడారు. తర్వాత అతడ్ని వదిలేసి.. తిరుపతికే చెందిన పృథ్వీరాజ్‌ను పెళ్లాడారు. తర్వాత అతడిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత రూ.25లక్షలు డిమాండ్ చేశారు. అనంతరం జర్మనీలో జాబ్ చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్ ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకొని.. పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి ముందే రూ. 5లక్షలు లాగేసిన ఆమె తర్వాత దొనకొండకు చెందిన రామాంజనేయులకు గాలం వేసింది.
తనను తాను ఐపీఎస్ గా కలర్ ఇచ్చిన స్వప్న.. తన ప్లానింగ్ లో భాగంగా పెళ్లాడింది. ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చిన రామాంజనేయులు చెప్పాపెట్టకుండా డెన్మార్క్కు వెళ్లిపోయాడు. దీంతో.. అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన వారు.. బాధితురాలకు న్యాయం చేద్దామనుకుంటే.. చివరకు అమ్మగారి అసలు స్వరూపం బయటపడటం.. నాలుగో పెళ్లికి రెఢీ అవుతున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి స్వప్నలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. జాగ్రత్తగా ఉండకుంటే.. ఎంతటి మగాడికైనా తిప్పలు తప్పవంటున్నారు.