ఓ విద్యార్థిని నర్సింగ్‌ చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలను చేసుకుంది. అయితే.. అప్పటి నుంచి ఎవ్వరితోనూ మాట్లాడలేదు. చనిపోయేందుకు రావాలని దెయ్యం పిలుస్తోందని, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే.. ఇంట్లో వాళ్లందరిని చంపేస్తానని బెదిరిస్తోందని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్ జిల్లా వేడచందూర్‌లోని ఓ గ్రామానికి ఓ వ్యక్తి కూలీ పనులు చేస్తుంటాడు. ఆయనకు ఇద్దరు కుమార్తైలు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కుమారై కోయంబత్తూరు వైద్య కళాశాలలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇటీవల ఇంటికి చేరుకున్న యువతి రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంది. ఆ తర్వాతి నుంచి ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. మౌనంగా ఉండేది.

శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. గదిలో తనిఖీ చేయగా.. సూసైడ్‌ నోటు కనిపించింది. అందులో ఆయువతి రాసిన విషయాలను చదివి విస్తుపోయారు.

‘రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. చనిపోయేందుకు రావాలని నన్ను పిలుస్తున్నట్లుగా ఉంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే.. ఇంట్లో వాళ్లందరిని చంపేస్తానని ఓ దెయ్యం నన్ను భయపెడుతోంది’ అని రాసి ఉంది. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.