ఎర్రకోట పంద్రాగస్టు వేడుకల్లో ఆ రెండు ప్రత్యేకతల్ని గమనించారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2020 9:27 AM ISTప్రతి ఏడాది మాదిరే ఈసారి దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలోని చారిత్రక ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎగురవేయటం తెలిసిందే. ఏడోసారి ఆయన జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం.. ఆయన ధరించిన వస్త్రధారణ..కరోనా నేపథ్యంలో స్వల్పంగా హాజరైన వారి గురించి.. ఇలా చాలా అంశాల మీదన ఇప్పటికి వార్తలు వచ్చేశాయి. కానీ.. రెండు అంశాల మీద మాత్రం పెద్దగా ఫోకస్ కాలేదు.
ఆ రెండింటిని చూస్తే.. ఒకటి ప్రధాని మోడీకి భద్రతగా.. సహాయకురాలిగా తొలిసారి మహిళా సైనికాధికారిని నియమించిన వైనం కనిపించింది. ఎర్రకోట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వేళలో మోడీకి మేజర్ శ్వేతా పాండే భద్రతను కల్పించారు. జెండా ఎగురవేసేటప్పుడు ఆయనకు సాయం చేశారు. ఇంతకీ ఈ శ్వేతా పాండే ఎవరన్నది చూస్తే.. ఆమెది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ప్రాంతానికి చెందిన వారు.
ఎనిమిదేళ్ల క్రితం (2012)ఆమె సైన్యంలో చేశారు. చెన్నై సైనిక అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆమె తండ్రి యూపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించారు. ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. తల్లి అమితా పాండే హిందీ.. సంస్కృత భాషల్లో ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో ఈసారి ప్రధాని మోడీకి మహిళా అధికారి ఒకరు సాయంగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మరో అంశం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థ అందరిని ఆకర్షించింది. ప్రధాని భద్రత కోసం వినియోగించిన ఈ పరికరం తొలిసారిగా వినియోగించారు. దీన్ని డీఆర్ డీవో డెవలప్ చేసింది. దీని ప్రత్యేకత ఏమంటే.. దాన్ని ఏర్పాటు చేసిన ప్రాంగణానికి మూడు కిలో మీటర్ల పరిధిలో నిఘా పెడుతుంది. అతి చిన్న పరిణామంలో ఉండే డ్రోన్లను సైతం చెక్ పెట్టే సామర్థ్యం దీని సొంతం. ప్రధాని మోడీ భద్రత కోసం తొలిసారి ఈ భద్రతా పరికరాన్ని వినియోగించటం ఆసక్తికరంగా మారింది.