ఎర్ర కోట సమీపంలో.. డ్రోన్ లు కనిపిస్తే వేసేయడమే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 11:23 AM GMT
ఎర్ర కోట సమీపంలో.. డ్రోన్ లు కనిపిస్తే వేసేయడమే..!

74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను గుర్తు చేసుకోవడమే కాకుండా.. పలు అంశాల గురించి ప్రస్తావించారు.

ఎర్ర కోట వద్ద మోహరించిన ఓ ఆయుధం గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంతో చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ ఆయుధం ఏమిటంటే.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోట సమీపంలో శనివారం మోహరించారు అధికారులు.

డీఆర్‌డీఓ డెవలప్ చేసిన లేజర్‌ వెపన్‌ ఆకాశంలో 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్‌లను గుర్తించడమే కాక జామ్‌ చేయగలదు. 1-2.5 కిలోమీటర్ల దూరంలోని లేజర్‌ వెపన్‌ టార్గెట్‌లను వాటేజ్‌ను బట్టి చేధించగలదని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ, ఉత్తర భాగాలలో పెరిగిన డ్రోన్ ఆధారిత కార్యకలాపాలకు ఇది సమాధానం చెబుతుందన్నారు అధికారులు.

దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయాలనుకునే వారికి దేశ సైనికులు దీటైన జవాబిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నియంత్రణ రేఖ మొదలు వాస్తవాధీన రేఖ వరకూ మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి వారి భాషలోనే మన సైనికులు సరైన జవాబిచ్చారన్నారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి సహాయపడే శక్తులను, వాటిని బలపరిచే శక్తులను ఓడించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన అన్నారు. సరిహద్దులు దాటేవారికి మన సైన్యం గుణపాఠం నేర్పిందన్నారు. మళ్లీ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే లద్దాఖ్‌లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుందని అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి ప్రారంభమైందని మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి మహిళలు, ఎస్సీలకు హక్కులు దక్కాయన్నారు. లద్దాఖ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని.. సిక్కిం తరహాలో లద్దాఖ్‌, లేహ్, కార్గిల్‌ను సంపూర్ణ సేంద్రీయ ప్రాంతాలుగా మారుస్తామని ప్రధాని చెప్పుకొచ్చారు. లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు.

Next Story