వ్యాక్సిన్ల దగ్గర నుండి.. హెల్త్ కార్డు దాకా మోదీ ప్రసంగం హైలైట్స్  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 7:17 AM GMT
వ్యాక్సిన్ల దగ్గర నుండి.. హెల్త్ కార్డు దాకా మోదీ ప్రసంగం హైలైట్స్  

దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు.

ఎర్రకోటపై నుంచి మోదీ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. 25 ఏళ్లు వస్తేనే తన కొడుకు సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటుందని, కానీ 75 ఏళ్లు వచ్చినా దేశం మాత్రం స్వయం సమృద్ధి సాధించలేకపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదని, ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంగా మిగిలిపోకూడదని, అది అందరి సంకల్పం కావాలని మోదీ పిలుపునిచ్చారు.

కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామన్నారు.

వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు కూడా కష్టపడుతున్నారన్నారు. త్వరలో వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. మూడు వ్యాక్సిన్ లు తుది దశలో ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి త్వరలోనే ఫలిస్తుందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ... విజయం సాధించాలన్నారు. కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలన్నారు.

యువతుల పెళ్లి వయసుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపిన మోదీ.. మహిళల్లో పోషకాహార లోపాల నివారణకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు.

వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌ను తీసుకెళ్లామని, ఆరేళ్లలో లక్షన్నర గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని అన్నారు. ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించిన ఘనత భారత మధ్యతరగతిదేనని మోదీ పేర్కొన్నారు.

ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ‘వన్‌ నేషన్‌.. వన్‌ హెల్త్‌’ దిశగా దేశంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను మోదీ ప్రారంభించారు. దీని కింద ప్రతి పౌరుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. ఈ పథకంలో ప్రజలు తమ ఆరోగ్య డేటాను ‘ఈ-రికార్డులు’గా అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ప్రజల ఆరోగ్య చికిత్సలకు సంబంధించిన డేటా నిక్షిప్తం అయి.. భవిష్యత్‌లో వారు మరో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే ఆ సమయంలో ఈ డేటాను వైద్యులు, ఆసుపత్రులు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. గత రికార్డుల ఆధారంగానూ రోగికి మెరుగైన వైద్యం అందుతుంది. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు.

దీని ద్వారా ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందన్నారు. ప్రతి పౌరుడికి ఒక ఐడీ కార్డు లభిస్తుందని, ఆసుపత్రి లేక ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన పరిధిలోకి వస్తుందని వివరించారు. భారత్‌లో ఆరోగ్య సేవల సామర్థ్యంతో పాటు పనితీరు, పారదర్శకతను పెంచుతుందన్నారు.

కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఎర్ర కోట వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కార్యక్రమానికి దాదాపు 4 వేల మంది అతిథులు హాజరయ్యారు.

Next Story