తెలంగాణ, ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. మరో 3 రోజుల పాటు..

Rains for 3 days in Telangana and AP. గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

By అంజి  Published on  13 Jan 2022 8:26 AM GMT
తెలంగాణ, ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. మరో 3 రోజుల పాటు..

గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే మరో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఛత్తీస్ ఘడ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి.. ఇవాల ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల ,రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణా రాష్ట్రంలో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ దక్షిణ, తూర్పు తెలంగాణా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో సైతం పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గురువారం నాడు తెనాలిలో భారీగా వర్షం కురిసింది. దీంతో పంట కాల్వలు పొంగి పొర్లాయి. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.

Next Story
Share it