ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశాలకు వేడి నుండి ఉపశమనం లేనట్లే

దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రత 43 నుండి 46 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతోంది

By Medi Samrat  Published on  4 May 2024 12:15 PM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశాలకు వేడి నుండి ఉపశమనం లేనట్లే

దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రత 43 నుండి 46 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతోంది. ప్రభుత్వం పలు హెచ్చరికలను జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశంలో హీట్‌వేవ్ స్పెల్ మే 5-7 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత వేడి ప్రభావం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, విదర్భ, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43-46 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్, మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో 40-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి" అని IMD బులెటిన్ తెలిపింది.

మేలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్‌లో తూర్పు, ఈశాన్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు నమోదైంది. నగర చరిత్రలోనే ఇప్పటి వరకు పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వలేదంటున్నారు. కరోనాకు ముందు గ్రేటర్‌లో 2015, 2018, 2019లో పలు మార్లు పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్‌ను చేరాయి.

Next Story