దూసకొస్తున్న మరో అల్పపీడనం.. ఏపీలోని ఆ రెండు జిల్లాలకు అలర్ట్.!
Andhrapradesh and tamilnadu coast on next 24 hours rainfall expected. దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే దీని ప్రభావం దక్షిణ తమిళనాడుతో పాటు శ్రీలంక దేశంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు గంటకు 12 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆకాశంలో పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు జిల్లాలు తప్పించి మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.