ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.. ఏపీ సీఎంపై షర్మిల ఫైర్

By Knakam Karthik
Published on : 17 Jan 2025 1:00 PM IST

telugu news, andra pradesh, cm chandrababu, sharmila, congress, tdp, ysrcp, janasena, bjp

ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.. ఏపీ సీఎంపై షర్మిల ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న సామెతలా చంద్రబాబు తీరు కనిపిస్తోందని సెటైర్ వేశారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు గారు, అమలు విషయానికి వచ్చే సరికి, ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టారని విమర్శించారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారమంటూ దుయ్యబట్టారు.

ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందనే విషయం తెలియదా అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు ట్వీట్ చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే ప్రతి సంవత్సరం రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని తెలియదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా, ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా అంటూ క్వశ్చన్ చేశారు షర్మిల. రాష్ట్రానికి సహాయపడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసమన్న షర్మిల, కేంద్రానికి మీరొక్కరుఏ కాదని తెలిసనప్పుడు మద్దతు ఎందుకు ఇచ్చారని అన్నారు.

ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి.. విజన్ల పేరుతో, వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప.. బాబు గారి పని తనం శూన్యమని విమర్శించారు. రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రత్యేక హోదానే సంజీవని' అని వైఎస్ షర్మిల ఎక్స్‌లో రాసుకొచ్చారు. నిధులు పారాలన్నా.. పరిశ్రమల స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యం' అంటూ షర్మిల ఎక్స్‌లో రాశారు.

Next Story