లద్ధాక్ సరిహద్దుల్లో డ్రాగన్ దుస్సాహసం.. అసలేం జరిగింది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 1:05 PM IST
లద్ధాక్ సరిహద్దుల్లో డ్రాగన్ దుస్సాహసం.. అసలేం జరిగింది?

మరోసారి డ్రాగన్ తన దుర్మార్గాన్ని బయటపెట్టింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. గత అనుభవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న భారత్.. డ్రాగన్ తీరును తిప్పికొట్టింది. గట్టిగా బదులిచ్చింది. సరిహద్దుల్లోచోటు చేసుకున్న తాజా పరిణామాల్ని చూస్తే.. చైనా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైనం కనిపించక మానదు. తూర్పు లద్దాఖ్ లో యథాతధ స్థితిని కొనసాగించాలంటూ కుదురిన ఒప్పందాన్ని కాలరాస్తూ ఆగస్టు 29 అర్థరాత్రి పాంగోంగ్ సో సర్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు చేరుకున్నాయి.

దీన్ని పసిగట్టిన భారత్ వేగంగా స్పందించింది. అప్రమత్తతో ఉన్న భారత సైనికులు తక్షణమే స్పందించి.. పెద్ద ఎత్తున బలగాలు తరలి వెళ్లటంతో డ్రాగన్ ప్లాన్ ను దెబ్బ తీయగలిగింది. అయితే.. ఈ సందర్భంగా రెండు పక్షాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాంగోంగ్ సో సరస్సు చుట్టుపక్కల అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాల్ని.. ఆయుధ సంపత్తిని మరింత పెంచినట్లుగా తెలుస్తోంది.

లద్దాక్ సరిహద్దుల్లోని యథాతధ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నం చేసిందని.. భారత్ ఆ చర్యల్ని తిప్పికొట్టినట్లుగా సైనిక వర్గాలు చెబుతున్నాయి. చైనా ప్రయత్నాల్ని సీరియస్ గా తీసుకున్న భారత సైన్యం పాంగోంగ్ సో.. ఉత్తర.. దక్షిణ తీరం చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లో భారీ బలగాతో పాటు.. ఆయుధ సంపత్తిని తరలించారు.

సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో భద్రతా దళాల కదలికలు పగటి వేళలోనే సాగాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉందని.. కానీ.. దానికి తూట్లు పొడుస్తూ మొదటిసారి అర్థరాత్ని వేళ.. చైనా చర్యలకు పాల్పడింది. తూర్పు లద్దాక్ చేరువలో హోటన్ వైమానిక స్థావరంలో జె20 యుద్ధ విమానాల్ని మొహరించింది. కైలాస మానస సరోవర్ భాగంలో ఉన్న ఒక సరస్సు వద్ద క్షిపణి స్థావరాన్ని చైనా నిర్మించింది. డీఎఫ్21 క్షిపణులు 2200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలవు.

తన బలగాల్ని ఉపసంహరించే అంశంపై చైనా చెప్పిన మాటలకు.. చేస్తున్న పనులకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. తమ సైన్యం వాస్తవాధీన రేఖకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని.. తామెప్పుడు నిబంధనల్ని ఉల్లంఘించమని పేర్కొంది. ఇలాంటి మాటలు చెప్పటం చైనాకు అలవాటైన పనిగా చెప్పక తప్పదు.

Next Story